సరిహద్దుల్లో సర్వసన్నద్ధమైన భారత సైన్యం 

తూర్పు లడఖ్‌లో ప్యాంగాంగ్‌ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చిన చైనా సైన్యాన్ని భారత దళాలు తిప్పికొట్టిన అనంతరం డ్రాగన్‌ దూకుడుకు చెక్‌ పెట్టేందుకు సైన్యం అప్రమత్తమైంది. చైనా కవ్వింపులపై తీవ్రంగా స్పందించాలని, డ్రాగన్‌ ఎత్తులను చిత్తుచేయాలని పదాతిదళాలకు విస్పష్ట ఆదేశాలు రావడంతో సరిహద్దుల్లో సైన్యం సర్వసన్నద్ధమైంది. 
 
సరిహద్దు ప్రతిష్టంభనపై ఇరు దేశాల మధ్య సైనిక​, దౌత్య చర్చలకు అవకాశం ఉన్నా చైనా దళాల దుందుడుకు చర్యలతో చుషుల్‌ సెక్టార్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక మీడియా ద్వారా మానసిక యుద్ధనీతిని చైనా సైనిక వ్యూహంగా ముందుకొస్తోంది. ఎల్‌ఏసీని మార్చేందుకు చైనా దళాలు తెగబడితే దీటుగా తిప్పికొట్టేందుకు భారత సైన్యం పదాతిదళాలు, సాయుధ దళాలు సన్నద్ధమయ్యాయి. 
 
లడఖ్‌ సరిహద్దు‌పై భారత సైన్యం పరిస్ధితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాస్కోలో ఎస్‌సీఓ సదస్సు నేపథ్యంలో చైనా రక్షణ మంత్రికి స్పష్టం చేశారు. సరిహద్దు ప్రతిష్టంభనను శాంతి ఒప్పందాల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా భావిస్తే ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల భేటీ జరిగే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్ధాయిలో మాత్రం చైనా దూకుడు పెంచడం ఆందోళన రేకెత్తిస్తోంది.
జూన్‌ 15న గల్వాన్‌ లోయలో ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సంప్రదింపులు సాగుతుండగానే సరిహద్దుల్లో చైనా సైనికుల సంఖ్య 60 శాతం పైగా పెరిగింది. మరోవైపు నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకూ చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతాయని డ్రాగన్‌ పరిశీలకులు పేర్కొంటున్నారు.
అమెరికాతో భారత్‌ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నందుకే చైనా వ్యూహాత్మకంగానే గల్వాన్‌, ప్యాంగాంగ్ ప్రాంతాల్లో కవ్వింపులకు దిగిందని చెబుతున్నారు. ఇక అమెరికాలో నాయకత్వ మార్పుపై స్పష్టత, నూతన పాలకులు డ్రాగన్‌ పట్ల అనుసరించే వైఖరి ఆధారంగా చైనా తదుపరి వ్యూహానికి పదునుపెట్టవచ్చని భావిస్తున్నారు.
ఇక భారత్‌ మాత్రం సరిహద్దు వివాదానికి శాంతియుత పరిష్కారానికి సంప్రదింపులకు మొగ్గుచూపుతూనే ఎల్‌ఏసీ వెంబడి భారీగా దళాల మోహరింపుతో సన్నద్ధంగా ఉంది.