నిమ్మగడ్డపై సిఐడి విచారణపై  హైకోర్టు స్టే 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గతంలో కేంద్ర హోంశాఖ కు వ్రాసిన లేఖకు సంబంధించి సీఐడి నిర్వహిస్తున్న విచారణపై అమరావతి హైకోర్టు స్టే విధించింది.

రమేష్‌కుమార్‌ రాసిన లేఖ వాస్తవానికి ఆయన రాయలేదని, ఇతరులు తయారు చేసిన లేఖను ఆయన పంపారని వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉద్యోగులను సీఐడీ అధికారులు విచారించారు. కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు.

కేసుల నమోదు కారణంగా ఉద్యోగులు తమ విధులను నిర్వహించలేకపోతున్నారని ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ హైకోర్టులో క్వాష్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారించిన కోర్టు ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. 

తదుపరి విచారణ నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారనే వివరాలను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.