ఉద్దవ్ థాకరేకు దావూద్ ఇబ్రహీం నుంచి ఫోన్ బెదిరింపు  

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు దావూద్ ఇబ్రహీం నుంచి ఫోన్ బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఆయన ఇంటిని పేల్చేస్తామంటూ ఫోన్లో బెదిరించడంతో ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అజ్ఞాత నేర ప్రపంచ నేత, కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఈ కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. దుబాయ్ నుంచి మొత్తం నాలుగు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. గత రాత్రి 11 నుండి 12 గంటల మధ్య ఈ కాల్స్ వచ్చిన్నట్లు తెలిపారు.

ముంబైలోని మాతోశ్రీలో నివాసం ఉంటున్న ఉద్దవ్ థాకరే ల్యాండ్ లైన్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి అనిల్ పరాబ్ ధృవీకరించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను దావూద్ ఇబ్రహీం యొక్క పనిమనిషి అని, ముఖ్యమంత్రితో మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పాడని తెలిపారు. 

ముఖ్యమంత్రి ఇంటికి కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతమున్న భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ కాల్ రావడం వెనుక ప్రత్యేక కారణం ఏమైనా ఉంటుందా అని పోలీసులు విచారిస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముంబై పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్ర సంస్థలను కూడా హై అలర్ట్ చేశారు.