18న కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభం

ఈ నెల 18న కనకదుర్గ ఫ్లై ఓవర్ ను  ప్రారంభించ‌నున్న‌ట్లు ఏపీ  ప్రభుత్వం వెల్ల‌డించింది. ఈ ఫ్లైఓవ‌ర్ వంతెన ప్రారంభోత్స‌వ‌ కార్య‌క్ర‌మాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంయుక్తంగా నిర్వ‌హించనున్నారు.
 
‌కరోనా నేప‌థ్యంలో కేంద్రమంత్రి గడ్కరీ  ఢిల్లీ నుంచి  వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన‌నున్నారు.  ఫ్లై ఓవ‌ర్ ప్రారంభంతో పాటు  అదే రోజు రూ. 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు 887 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేప‌ట్ట‌నున్నారు.
రూ. 8,083 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీతో క‌లిసి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. తొలుత ఈనెల 4న క‌న‌క‌దుర్గ వంతెనను ప్రారంభించాల్సి ఉంది.
అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం మరణించడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తోంది. దీంతో ఈ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. రూ.502 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే.