టిటిడి నిధులపై కాగ్‌తో ఆడిట్‌

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధుల వినియోగంపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని టిటిడి ధర్మకర్తల మండలి కోరింది. 
 
ఈ మేరకు గత నెల 27 జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఇకపై ప్రతిఏటా నిధుల వినియోగంపై కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేసేలా తీర్మానం చేసింది. 2014-15 నుంచి 2019-20 మధ్య నిధుల వినియోగంపై రీ ఆడిట్‌ చేయాలని నిర్ణయించింది. 
 
గతంలో ఆడిట్ ప్రక్రియను అంతర్గతంగా నిర్వహించేవారు. ప్రభుత్వం అనుమతించిన తర్వాత కాగ్‌ ఆడిట్‌ ప్రక్రియ ప్రారంభించనుంది. నిధుల వినియోగం విషయంలో పారదర్శకత పెంచాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్‌ చేయించడంతోపాటు, ఇక ముందు కూడా ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్‌ సబర్వాల్‌తో కలసి బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిల్‌ వేశారు.
 ఈ నిర్ణయం తీసుకున్న టిటిడి పాలకవర్గాన్ని, అందుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన అభినందిస్తూ గొప్ప నిర్ణయమని కొనియాడారు. తన ప్రతిపాదనను సీఎం వైఎస్‌ జగన్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌లో పేర్కొన్నారు.