పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పధకం 

గ్రామాల్లో అమలవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను పట్టణాలకు  కూడా విస్తరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తున్నది. కరోనా లాక్‌‌డౌన్‌‌తో నగరాలలో నిరుద్యోగం పెరగడంతో, ఈ ఫ్లాగ్‌‌షిప్ పధకం‌‌ను నగరాల్లో అమలు చేయాలనుకుంటోంది. 

కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత ఈ పధకాన్ని  తొలుత చిన్న పట్టణాల్లో అమలు చేస్తామని హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ ప్రొగ్రామ్‌‌కు అయ్యే ఖర్చు తొలుత రూ.35,000 కోట్లుగా ఉంటుందని చెప్పారు. 

గతేడాది నుంచే ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు. గ్రామాలలో ఎన్‌‌ఆర్‌‌‌‌ఈజీఎస్ కోసం  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటికే రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది. 

ఈ పధకం క్రింద ఏడాదిలో వంద రోజుల పనిదినాలను ప్రభుత్వం కల్పిస్తోంది. రోజుకు కనీస జీతం రూ.202ను ప్రభుత్వం ఇస్తోంది. కరోనా వైరస్‌‌తో పట్టణ  ప్రాంతాల్లో ప్రభావితమైన ప్రజల కోసం ఈ పధకాన్ని నగరాలకు కూడా కేంద్రం తెస్తోంది. కరోనాతో ఆసియాలోనే మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్థ  అయిన భారత్  ప్రమాదంలో పడింది. 

చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిన్న పట్టణాల నుంచి ఈ పధకం  తొలుత ప్రారంభమవుతుందని పెద్ద పెద్ద నగరాలలో అయితే నైపుణ్యం కలవారు అవసరమని కుమార్ తెలిపారు.  గ్రామీణ ఉపాధి హామీ పధకంలో స్థానికంగా  జరిగే రోడ్డు బిల్డింగ్, అటవీ ప్రాంతాలు అభివృద్ధి వంటి ప్రభుత్వ ‌‌ ప్రాజెక్ట్‌‌లుంటాయి.

ప్రస్తుతం ఈ పధకం  కింద 27 కోట్ల మందికి పైగా కవర్ అవుతున్నారు. లాక్‌‌డౌన్‌‌తో నగరాల  నుంచి గ్రామాలకు తిరిగొచ్చిన వలస కూలీలకు ఈ పధకం ద్వారా ఉపాధిని అందించారు.

పట్టణ  ప్రాంతాల్లో చాలా మందిని కరోనా పేదరికంలోకి నెట్టేసిందని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనాలసిస్‌‌లో వెల్లడైంది. ఏప్రిల్ నెలలో సుమారు 12.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఉపాధిని కోల్పోయారు. నిరుద్యోగం  రేటు కూడా ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలకు అంటే 23 శాతానికి పెరిగినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది.

ఆర్ధిక వ్యవస్థ తిరిగి ప్రారంభం కావడంతో నిరుద్యోగ రేటు కాస్త తగ్గింది. ప్రస్తుతం ఇది 8.35 శాతానికి దిగొచ్చింది. పట్టణ  ప్రాంత కార్మికులు పేదరికంలో పడకుండా నిరోధించేందుకు, జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పనిచేయాల్సి ఉందని నిపుణులు సూచించారు.

‘ సిటీ ఆఫ్ డ్రీమ్స్ నో మోర్: ది ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ 19 ఆన్ అర్బన్ వర్కర్స్ ఇన్ ఇండియా ’ పేరుతో ఓ నివేదికను  షానియా భలోటియా, స్వాతి ధింగ్రా, జొల్లా కొండిరోలి రూపొందించారు.