సెప్టెంబర్ 7 నుండి హైకోర్టులో ప్రత్యక్షంగా కేసులు   

సెప్టెంబర్ 7 నుంచి హైకోర్టులో ప్రత్యక్షంగా కేసుల విచారణ మొదలుకానుంది. కరోనా ప్రభావంతో ఇన్నాళ్లూ హైకోర్టులో లాక్ డౌన్ విధించటంతో ఆన్ లైన్ లోనే కేసులు విచారిస్తున్నారు. శనివారం హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో లాక్ డౌన్ ను ముగించాలని నిర్ణయించారు. 

చీఫ్‌‌జస్టిస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్, న్యాయమూర్తులు జస్టిస్‌‌ పి. నవీన్‌‌రావు, జస్టిస్‌‌ చల్లా కోదండరాం, జస్టిస్‌‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్ ‌‌జి. శ్రీదేవి సింగిల్‌‌బెంచ్‌ ‌లు ప్రత్యక్షంగా కేసులు విచారించనున్నాయి. కోర్టులు ప్రారంభించాలని బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేయటంతో ఈ నిర్ణయం  తీసుకున్నారు. 

ప్రత్యక్ష విచారణకు సంబంధించి  గైడ్ లైన్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. జిల్లాల్లోనూ కోర్టులు ప్రారంభించేందుకు జడ్జీలు, కోర్టు సిబ్బంది సిద్ధంగా ఉన్నామని, జిల్లా కోర్టులకు నిందితులను హాజరుపర్చేందుకు సిద్ధమని ఎస్పీలు కూడా చెప్పినట్లు సమాచారం. ముందుగా హైకోర్టులో పూర్తిస్థాయిలో ప్రత్యక్ష విచారణలు మొదలైన తర్వాత అన్ని కోర్టులు పనిచేయటంపై నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా, హైకోర్టు ఉద్యోగులకు కూడా అపాయింటెడ్ డే 2014 జూన్ 2 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు హైకోర్టు ఉద్యో గులకు కూడా అపాయింటెడ్ డే 2014 జూన్2వ తేదీనేనని రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. ఉమ్మడి ఏపీ విభజన జరిగినప్పటి నుంచే ఉద్యోగుల విభజన జరుగుతున్నదని, హైకోర్టు ఉద్యోగులకు కూడా అదే వర్తిస్తుందని తీర్పు చెప్పింది. 

ఉమ్మడి హైకోర్టును రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి 2019 జనవరి 1 ఇచ్చిన ఉత్తర్వుల నాటి నుంచి హైకోర్టు ఉద్యోగుల విభజన అమలుచేయడం చెల్లదని స్పష్టం చేసింది. బలరామరాజు సహా పది మంది చేసిన అప్పీల్ పిటిషన్ ను ఇటీవల జస్టిస్‌ ‌ఎమ్మెస్‌ ‌రామచంద్రరావు, జస్టిస్‌‌ టి.అమర్‌‌నాథ్‌‌గౌడ్‌‌తో కూడిన బెంచ్ విచారించి 69పేజీల తీర్పు వెలువరించింది.