విశాఖలో మరో శిరోముండనం

‘దళితుడికి శిరోముండనం చేయడమా’ అంటూ తూర్పుగోదావరి ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల్ని ముఖ్యమంత్రి వై ఎస్  జగన్‌ మోహన్ రెడ్డి మందలించిన వారం రోజులకే విశాఖలో  మరో దళితుడికి అటువంటి అవమానమే జరిగింది. ఈ వ్యవహారంలో విశాఖ పోలీసులు శనివారం ఏడుగురిని అరెస్టు చేశారు.

అరెస్టు అయినవారిలో సినీ నిర్మాత నూతన్‌నాయుడు భార్య నర్సింగి ప్రియమాధురి అలియాస్‌ మౌనిక, వారి ఇంట్లో పనిచేసే తెల్ల ఇందిరారాణి, సూపర్‌వైజర్‌ చేబ్రోలు వరహాలు, సీలం బాలగంగాధర్‌, ముగడ ఝాన్సీ, కళింగపట్నం సౌజన్యతోపాటు క్షురకుడు ఇప్పిలి రవికుమార్‌ ఉన్నారు. 

పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా తెలిపిన వివరాలు శ్రీకాకుళంజిల్లా పలాసకు చెందిన దళిత యువకుడు ప ర్రి శ్రీకాంత్ ‌(19) పెందుర్తి సుజాతానగర్‌లోని ని ర్మాత నూతన్‌నాయుడు ఇంట్లో హౌస్‌ కీపింగ్‌ ప ని చేసేవారు. అయితే, ఈనెల ఒకటిన జీతం తీసుకుని నూతన్‌ భార్య మౌనికకు చెప్పి పని మానేశా రు. 

రెండురోజుల క్రితం శ్రీకాంత్‌కు ఆమె ఫోన్‌ చేశారు. ఇంట్లో ఐఫోన్‌ పోయిందని, మాట్లాడేందుకు రావాలని పిలిపించారు. శ్రీకాంత్‌ వెళ్లగా, దొంగిలించిన ఫోన్‌ ఇవ్వాలంటూ మౌనిక డిమాండ్‌ చేశారు. తాను ఫోన్‌ తీయలేదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిజం తెలుస్తుందని చెప్పి శ్రీకాంత్‌ వచ్చేశారు. 

మరునాడు శుక్రవారం మరోసారి శ్రీకాంత్‌ను మౌనిక పిలిచారు. ఆయన ఇంటి హాలులోకి వెళ్లగానే ‘సెల్‌ఫోన్‌ ఎక్కడ పెట్టా’వంటూ శ్రీకాంత్‌ను హౌస్‌ కీపర్‌ ఇందిరారాణి కర్ర, ఇనుపచువ్వతోనూ కొట్టారు. ఈ సమయంలో మౌనిక అక్కడే సోఫాలో కూర్చొన్నారు. దెబ్బలు తట్టుకోలేక శ్రీకాంత్‌.. చేతులెత్తి వేడుకున్నా కనికరించలేదు.

 ఆ ఇం టికి సమీపంలో సెలూన్‌ షాప్‌ నిర్వహించే రవికుమార్‌ను పిలిపించి శ్రీకాంత్‌కు శిరోముండనం చేశారు. ఆ సమయంలో శ్రీకాంత్‌ చుట్టూచేరి సెల్ఫీలు దిగారు. తప్పించుకున్న శ్రీకాంత్‌.. పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సీపీ ఆదేశాలతో పోలీసులు నూతన్‌ ఇంట్లోని సీసీ కెమెరాల ఫుటేజీ ని సేకరించారు. బాధితుడిని కేజీహెచ్‌కు పంపించి చికిత్స చేయించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేశారు.