అవసరమైతే వడ్డీరేట్లను మరింత  తగ్గిస్తాం  

ఆర్థిక ప్రగతి కోసం అవసరమైతే వడ్డీరేట్లను మరింత తగ్గిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు.  కరోనా వైరస్‌ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మా నిర్ణయాలు ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు. 

పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత కేంద్రానిదేనని, ఆర్బీఐ చేసేదేమీ లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. చివరి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవడం కూడా ఈ వాదనలకు బలం చేకూర్చింది. 

ఒక వెబినార్‌లో మాట్లాడుతూ ‘వడ్డీరేట్ల కోతలు లేదా ఇతర నిర్ణయాలు ఇంకా ఉంటాయి’ అని తెలిపారు. మహమ్మారితో తలెత్తిన విపత్కర పరిస్థితులను జయించడానికి ఇంకా పోరాడుతూనే ఉన్నామన్న ఆయన మా తుపాకీలో తూటాలున్నాయని వ్యాఖ్యానించారు.

ఇలా ఉండగా, మోసాల నుంచి తప్పించుకోవడానికి ఆయా వ్యాపారాల్లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులను ముందే పసిగట్టాలని బ్యాంకర్లకు  దాస్‌ సూచించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు ప్రభావితమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) పెరుగుతూపోతున్న సంగతీ విదితమే. దీంతో బ్యాంకర్లలో అప్రమత్తత అవసరమని ఆయన సూచించారు.