శివసేన ఎంపీ సంజయ్ జాదవ్ రాజీనామా  

మహారాష్ట్రలోని పర్భానికి చెందిన శివసేన ఎంపీ సంజయ్ జాదవ్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జాదవ్ తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు పంపారు. 
 
తన ప్రాంతంలో పార్టీ కార్యకర్తలకు న్యాయంచేయలేకపోవడం వల్లే తాను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. స్థానికంగా ఎన్సీపీ నేతల ప్రాబల్యం పట్ల నిరసనగా రాజీనామా చేసిన్నట్లు తెలుస్తున్నది. 
 
 ‘నా ప్రాంతంలో పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేనప్పుడు నాకు ఎంపీగా ఉండే అర్హత లేదు. కాబట్టి దయచేసి నా యొక్క రాజీనామాను అంగీకరించండి’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
 
పర్భాని జిల్లాలో జింతూర్ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీకి (ఎపిఎంసి) ప్రభుత్వేతర వ్యక్తిని చైర్మన్ గా నియమించడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని జాదవ్ తెలిపారు.
 
 ‘నేను గత 8 నుంచి 10 నెలలుగా ఈ నియామకం గురించి అడుగుతూనే ఉన్నాను. పార్టీ కార్యకర్తలకు ఇస్తే బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పాను. కానీ, ఇప్పుడు ఎన్‌సీపీకి చెందిన వ్యక్తిని చైర్మన్ గా నియమించారు. ఇది శివసేన కార్యకర్తలను అవమానించడమే’అని ఆయన ధ్వజమెత్తారు.