సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ మాఫియా ?

 ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకు ఇందులో డ్రగ్ మాఫియా ప్రమేయంపై పలు ఆధారాలు లభిస్తున్నాయి.  సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్ సుశాంత్ కేసులో మాదకద్రవ్యాల మాఫియా ప్రమేయాన్ని బహిర్గతం చేసింది. 
 
రియా చక్రవర్తి మాదకద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసిందని తేలింది. ఈ వాట్సాప్ చాట్ ను రియా తొలగించినా, దీన్ని అధికారులు తిరిగి పొందారు. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం బయటపడటంతో ఈ కేసులో మాదకద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం రేకెత్తింది.
‘‘మనం హార్డ్ డ్రగ్ గురించి మాట్లాడాలి, నేను దీన్ని వాడలేదు’’ అని రియా 2017 మార్చి 8వతేదీన డ్రగ్ డీలరు గౌరవ్ తో వాట్సాప్ లో మాట్లాడింది. రెండోసారి మాదకద్రవ్యాల డీలరు గౌరవ్ తో రియా మాట్లాడుతూ ‘‘మీ వద్ద ఎండీ ఉందా?’’ అని అడిగింది.
ఎండీ అంటే మిథిలీన్ డయాక్సీ మెథాంపేటమిన్ అని బలమైన మాదకద్రవ్యం. మరో సారి రియా చక్రవర్తి తో శామ్యూల్ మిరాండా చాటింగ్ చేశాడు. ‘‘హాయ్ రియా విషయం దాదాపుగా ముగిసింది’’ అని పేర్కొన్నాడు.
2020 ఏప్రిల్ 17వతేదీన జరిగిన మిరాండా, రియాల మధ్య జరిగిన సంభాషణలో ‘‘మేం షోవిక్ స్నేహితుడి నుంచి మాదకద్రవ్యాలు తీసుకోవచ్చా’’అని చాటింగ్ లో ప్రశ్నించారు. సుశాంత్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రియా వాట్సాప్ చాటింగ్ వివరాలు వెల్లడించడంతో దీన్ని సీబీఐ విశ్లేషించడానికి ఈడీతో చేతులు కలపనుందని సమాచారం.
 
రియాతో పాటు ఆమె కుటుంబసభ్యుల ఫోన్లు, ల్యాప్ టాప్ లను ఈడీ స్వాధీనం చేసుకుంది. సుశాంత్ మరణానికి ముందు దుబాయ్ కు చెందిన మాదకద్రవ్యాల వ్యాపారిని కలిశారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గతంలో వెల్లడించారు.