మరో బెంచ్‌కు ప్రశాంత్ భూషణ్ కేసు

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అవినీతి గురించి 2009లో ఆరోపణలు చేసిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేసు విచారణను సుప్రీంకోర్టు మరో బెంచ్‌కు సిఫార్సు చేసింది. ఈ కేసు విచారణకు తగిన బెంచ్‌ను కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేను ధర్మాసనం మంగళవారం కోరింది.

మరో బెంచ్ కేటాయింపు కోసం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 10న లిస్టింగ్ చేసింది. తనకు తగిన సమయం లేదని, ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు.

ఈ కేసు కేవలం శిక్షకు సంబంధించినది కాదని, వ్యవస్థపై నమ్మకానికి సంబంధించినది ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనప్పుడు శిక్షపై మినహాయింపు కోరి ఏమి ప్రయోజనమని జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రశాంత్ భూషణ్ తరుఫున హాజరైన న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు.

న్యాయమూర్తుల అవినీతిని గురించి ప్రశ్నించిన ఈ కేసు ధిక్కారం కిందకు వస్తుందా రాదా అన్నది రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని ఆయన కోరారు. అయితే ఈ కేసుకు సంబంధించి తమకు పలు సందేహాలున్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు.

1.న్యాయమూర్తుల అవినీతి గురించి మీడియా ముందు మాట్లాడవచ్చా? 2. ఏ న్యాయమూర్తిపైన నీకు వివాదం ఉంటే ఎలా వ్యవహరించాలి? 3. ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఆరోపణలు చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని చెప్పారు.

కాగా, దీనికి బదులిచ్చిన రాజీవ్ ధావన్, కేవలం అవినీతి అన్న పదం ఉపయోగించినంత మాత్రాన అది కోర్టు ధిక్కారం కిందకు రాదని చెప్పారు. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని ఆయన కోరారు. దీంతో ఈ కేసు విచారణను మరో బెంచ్‌కు సిఫార్సు చేస్తున్నట్లు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా పేర్కొన్నారు.

2009లో తెలహ్కా మ్యాగజైన్‌కు ఇంటర్యూ ఇచ్చిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులోని 16 మంది న్యాయమూర్తుల్లో సగానికిపైగా అవినీతిపరులేనని ఆరోపించారు. అలాగే దీనిపై పలు ట్వీట్లు కూడా చేశారు. వీటిని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఈ కేసులో ఆయనను దోషిగా ఇటీవల నిర్ధారించింది.

అయితే శిక్షను ఇంకా ఖరారు చేయలేదు. తాను చేసిన ట్వీట్లపై క్షమాపణ చెప్పాలని ధర్మాసనం కోరగా అందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. ఈ కేసు విచారణ దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడంతోపాటు బార్, బెంచ్ మధ్య సమన్వయాన్ని ప్రశ్నిస్తున్నది.