మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ 

వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. జూలై 6వ తేదీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
 
వైసీపీ నాయకుడు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో సహకారం అందించారనే ఆరోపణతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతాపురం వద్ద జూలై 3న అరెస్ట్‌ చేశారు.
 
మోకా భాస్కరరావు జూన్ 29న హత్యకు గురయ్యారు. మోకా భాస్కరరావు మంత్రి పేర్ని నానికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. మచిలీపట్నం 23వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మోకా భాస్కరరావు జూన్ 29న పట్టణంలోని చేపల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. 
 
ఉదయం 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై వెనుదిరిగారు. అదే సమయంలో ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. గుండెల్లో పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయనను ఆటోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఏ4 నిందితుడిగా చేర్చారు.