ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద పోటెత్తుతూ ఉండడంతో అధికారులు 70 గెట్లు ఎత్తి నీటి దిగువకు వదిలారు. ఉదయం 8గంటలకు ప్రకాశం బ్యారేజీలో నమోదు అయిన వరద ప్రవహం ప్రకారం.. ఇన్‌ఫ్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,056 క్యూసెక్కులుగా ఉంది. 12 అడుగుల పూర్తీ స్థాయి నీటి మట్టంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా ఉన్నది. 
 
దీంతో అధికారలు బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా 10,356 క్యూసెక్కులు నీటి విడుదల చేశారు. నదీ పరీవాహక లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతోంది. 
ఇవాళ రాత్రికి (ఆదివారం) వరద మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. 3.97 లక్షల క్యూసెక్కులకు వరద చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.  కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నది పరివాహక ప్రాంతాలైన రణదివినగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామనగర్, భవానీపురం, విద్యాధపురం  మొదలగు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారు.  నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.  పునరావాస కేంద్రాలకు  తరలి వెళ్లాలని  నగర  కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
కాగా, పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తివేయడంతోపాటు, మధ్యలో కొంత వరద నీరు కూడా కలవడంతో పులిచింతలకు 3.41 లక్షల కూసెక్యుల వరద నీరు వస్తోంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 45 టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 38 టిఎంసీలుగా ఉంది. దీంతో పులిచింతలలోని 16 గేట్లను ఎత్తి వరద నీరును వదిలేస్తున్నారు  
మరోవంక,  గోదావరి వరద ఉదృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయినా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 17.90 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు పూర్తిగాఎత్తివేసి.. 19.31 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.