కరోనాతో పుంజుకున్న ఫార్మా ఎగుమతులు 

కరోనాతో భారత్ ఫార్మా ఎగుమతులు వేగంగా పుంజుకొంటున్నాయి. కరోనా వచ్చే నాటికి ఒక్క పీపీఈ కిట్‌ను కూడా తయారు చేయని భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ  అతిపెద్ద ఎగుమతిదారుడిగా నిలిచింది.  చైనా తరువాత ఇప్పుడు మన దేశంలో ప్రతి రోజూ 5 లక్షల పీపీఈ కిట్లు తయారవుతున్నాయి. 
 
పీపీఈ కిట్ల తయారీ మాత్రమే కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు కూడా విక్రయించే స్థాయికి చేరుకున్నాం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, జూలై నెలలో అమెరికా, బ్రిటన్, యూఏఈతోపాటు మరో ఐదు దేశాలకు భారత్ 2.3 మిలియన్ల పీపీఈ కిట్లను ఎగుమతి చేసింది. పీపీఈ కిట్లు మాత్రమే కాకుండా మాస్క్ తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచాం. ఇప్పుడు రోజూ 3 లక్షలకు పైగా ఎన్ -95 మాస్క్‌లు తయారవుతున్నాయి. 
పీపీఈ కిట్లు, మాస్కులకు మాత్రమే కాకుండా భారత్ ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులను కూడా పెంచింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఏప్రిల్, జూన్ మధ్య ఫార్మా ఉత్పత్తుల దిగుమతి 1.41 శాతం తగ్గింది. గత ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య ఇతర దేశాల నుంచి రూ.4,172 కోట్ల ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.
కాగా, ఈ ఏడాది ఈ మూడు నెలల్లో రూ.4,113 కోట్ల విలువైన ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. అంటే, గత సంవత్సరంతో పోలిస్తే ఫార్మా ఉత్పత్తుల దిగుమతిలో రూ.58 కోట్లు తగ్గాయి. భారత్ 3 నెలల్లో రూ.33 వేల కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఇతర దేశాలకు విక్రయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ 150 దేశాలకు సహాయం చేసింది.
కరోనా వ్యాప్తి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇతర దేశాలకు ప్రారంభమైన వెంటనే ప్రపంచంలో భారతదేశ మందులకు డిమాండ్ పెరిగింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు మలేరియాను నయం చేయడానికి ఉద్దేశించినది. అయితే, ప్రారంభంలో ఇది కరోనా సోకిన రోగులపై మంచి ప్రభావాన్ని చూపించింది. దీని తరువాత ప్రపంచంలోని 100 కి పైగా దేశాలు భారత్ నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు కావాలని అడిగారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఒక్క అమెరికాకే 50 మిలియన్ డోసుల హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలను భారత్ సరఫరా చేసింది. ప్రపంచంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ యొక్క అతిపెద్ద తయారీదారు, ఎగుమతిదారు భారతదేశం. హైడ్రాక్సీక్లోరోక్విన్ తోపాటు పారాసెటమాల్ మాత్రల డిమాండ్ కూడా పెరిగింది.
కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో భారతదేశ సహాయం 150 దేశాలకు చేరుకుందని జూన్ నెలలో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలిలో ప్రధాని మోదీ చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సహాయం చేసినందుకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశాన్ని ప్రశంసించారు.