విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యానే యూసీజీ నిర్ణయం  

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తుది సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. భవిష్యత్‌లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లతో ఇంటరాక్షన్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, బ్లెండెడ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం యూనివర్సిటీలకు ఇచ్చినట్లు తెలిపారు.

నూతన విద్యా విధానం ప్రపంచ వేదికపై నాయకుడిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుందని పోఖ్రియాల్ భరోసా వ్యక్తం చేశారు. 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌)ను 50శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సాధించాల్సింది భారీ లక్ష్యమని చెప్పారు. 

‘కొత్త జాతీయ విద్యా విధానం-2020 దేశ నిర్మాణానికి పునాది’గా కేంద్రమంత్రి అభివర్ణించారు. 45వేల డిగ్రీ కాలేజీలను అభివృద్ధి చేసి.. వారికి స్వయం ప్రతిపత్తినివ్వాలన్న దానిపై పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 8వేల కళాశాలలకు మాత్రమే స్వయం ప్రతిపత్తి ఉందని, దశలవారీగా పెంచనున్నట్లు పేర్కొన్నారు. 

జూలై 6న యూజీసీ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌, బ్లెండెడ్‌ విధానంలో సెప్టెంబర్‌ చివరి నాటికి తుది సంవత్సరం, తుది సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి చేయాలని యూనివర్సిటీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా, యూజీసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా.. వాటిని కొట్టివేసింది.