ఐఐటీలు సామాజిక సమస్యలపై అధ్యయనం చేయాలి

సమాజం, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం, మరింత లోతైన పరిశోధనలు జరపడం ద్వారా ఆయా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని ఐఐటీలు సహా ఉన్నతవిద్యాసంస్థలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, అరోగ్య సమస్యలు తదితర అంశాలను మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని సూచించారు.

ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలను ఆన్‌లైన్ వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. గతేడాది ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థల్లో కేవలం 8 భారతీయ సంస్థలే ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించి విచారం వ్యక్తం చేశారు.   కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యావిధానం-2020 ద్వారా మళ్లీ భారత్ విశ్వగురువుగా, ప్రపంచ విద్యాకేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారమార్గాలను కనుగొనడం ఐఐటీ, ఇతర ఉన్నత విద్యాసంస్థల ముందున్న తక్షణ కర్తవ్యమని తెలిపారు. ఈ దిశగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డీ)పై ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఇందుకోసం విద్యారంగంలోని ఇలాంటి ప్రాజెక్టులను గుర్తించి వాటికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రైవేటు రంగం ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

ఉన్నత విద్యాసంస్థలు,  పరిశ్రమలు పరస్పర సహకారాన్ని కలిగి ఉండి, అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో కలసి ముందుకెళ్లాలని సూచించారు. విద్యాసంస్థల్లో పరిశోధనలను చేస్తున్న వారికి వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు అండదండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వీలైనంత త్వరగా చక్కటి పరిష్కారాలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

యువతకు సరైన నైపుణ్యాన్ని అందించగలిగితే భారత్ ప్రపంచ యవనికపై పుష్కలమైన అవకాశాలు అందిపుచ్చుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే దిశగా ముందుకు సాగడం ఖాయమని తెలిపారు. ఇందుకోసం విద్యాప్రమాణాలనుపెంచుకోవాల్సిన అవసరమున్నదని చెప్పారు.

ఈ సందర్భంగా ఐఐటీ న్యూఢిల్లీ డైమండ్ జూబ్లీ లోగో, 2030 స్ట్రాటజీ డాక్యుమెంట్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ఐఐటీ ఢిల్లీ డైరక్టర్ ప్రొఫెసర్ వీ రామ్ గోపాల్ రావ్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.