ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు రోజుల క్రితం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోద ముద్రతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యం లోనే హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని పిటిషన్ దాఖలైంది.
రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది. పిటిషనర్ పిటిషన్ లో జీఎన్‌రావు, హైపవర్ కమిటీలు చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరారు. సీఎం కార్యాలయం, సచివాలయం, రాజ్ భవన్ లను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
రేపు ఈ పిటిషన్ గురించి విచారణ జరిగే అవకాశం ఉన్నది. హైకోర్టు ఈ పిటిషన్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు శనివారం రోజు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
గవర్నర్ ఆమోద ముద్ర వల్ల రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్ గా కర్నూలు, లెజిస్లేచర్ క్యాపిటల్ గా అమరావతి ఉంటాయి. ఈ నెల 15న విశాఖలో జగన్ సర్కార్ సీఎం కార్యాలయానికి భూమిపూజ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వం విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్, సెక్రటేరియట్ ఏర్పాటు చేయనుంది. హైకోర్టు, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన కార్యాలయాలను కర్నూలుకు తరలించనుంది. లెజిస్లేచర్ క్యాపిటల్ మాత్రం అమరావతిలో ఉంటుంది. జగన్ మూడు రాజధానుల నిర్ణయం పట్ల రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు.
More Stories
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పరచాలి