రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు  ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర  ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారం లోనే బిజెపి జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు. 

రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కూడా మూడు రాజధానిలో విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని తేల్చిచెప్పారు. 

అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక తాము సీరియస్‌గా ఉండబోతున్నామని వెల్లడించారు. 

2024లో అధికారం సాధించే దిశగా ముందుకెళ్తున్నామని ప్రకటించారు. బీజేపీ-జనసేనకు 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తాము భావిస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు. ఈ ఓట్లశాతాన్ని దాదాపు రెట్టింపుగా చేసుకోవడమే తమముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. 

తమ దృష్టిలో టీడీపీ, వైసీపీలు రెండూ కుటుంబ పార్టీలేనని వీర్రాజు స్పష్టం చేశారు. బిజెపి మాత్రం సకల జనుల పార్టీ అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో  ప్రస్తుతం ఉన్న కుటుంబ పరిపాలన మార్చడం కోసం తాము గట్టి ప్రయత్నం చేస్తామని వీర్రాజు వెల్లడించారు.

ఇప్పటి ప్రభుత్వం పంపిణి పేరుతో భూములు కొంటున్నారు దాంట్లో కూడా కమిషన్ లాగేస్తున్నారని విమర్శించారు. మరోవంక, బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగమని ధ్వజమెత్తారు. అయితే ఈ ఆటలో తాము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తామని హెచ్చరించారు.