అచ్చెన్నాయుడికి బెయిల్ తిరస్కరించిన‌ హైకోర్టు

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. అలాగే ఈ కేసులో మిగిలిన నిందితుల‌కు సంబంధించి బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. 
 
మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గత నెల 12న అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయ‌న బెయిల్ పిటిషన్ ఏబీసీ కోర్టు తిర‌స్క‌రించ‌గా, ఇప్పుడు హైకోర్టులోనూ ఎదురుదెబ్బ త‌గిలింది. అచ్చెన్నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. 
 
న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ చేప‌ట్టిన‌ విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏసీబీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తీర్పును రిజ‌ర్వ్ చేశారు. 
 
ఇదే కేసులో ఏ1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్‌ సీకే రమేశ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పైనా సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేయ‌గా.. అన్ని పిటిష‌న్ల తీర్పును ఇవాళ వెల్ల‌డించింది హైకోర్టు.