యూఏఈ నుంచి 250 కిలోల బంగారం రవాణా   

ఇటీవ‌ల కేర‌ళ‌లో జ‌రిగిన 30 కేజీల బంగారం స్మ‌గ్లింగ్ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ పోలీసులు ఓ భారీ కుట్ర‌ను చేధించే ప్ర‌య‌త్నం చేశారు. దౌత్య‌ప‌ర‌మైన మార్గాల్లో యూఏఈ నుంచి మొత్తం మీద సుమారు 250 కిలోల బంగారం భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు కనుగొన్నారు. 

ఆ బంగారాన్ని ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల కోసం వినియోగిస్తున్న‌ట్లు ఓ అధికారి అనుమానాలు వ్య‌క్తం చేశారు. భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసేందుకు ఈ ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు ఆ అధికారి తెలిపారు. ఈ కోణంలోనే కేసును విచారిస్తున్న‌ట్లు చెప్పారు. 

ఇప్ప‌టికే ఈ కేసుతో సంబంధం ఉన్న కేర‌ళ సీఎం మాజీ కార్య‌ద‌ర్శిని ఎన్ఐఏ విచారిస్తున్న‌ది. 30 కేజీల బంగారం స్మ‌గ్లింగ్‌ కేసుతో లింకు ఉన్న యూఏఈ దౌత్య కార్యాల‌య సిబ్బందిని కూడా పోలీసులు అరెస్టు చేసి ప్ర‌శ్నిస్తున్నారు. 

గ‌త ఏడాది జూలై నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 250 కేజీల బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేసిన‌ట్లు ఎన్ఐఏ అధికారి  అనుమానాలు వ్య‌క్తం చేశారు. మరోవంక  ఎన్ఐఏ ప్ర‌త్యేక కోర్టు.. స్వ‌ప్నా సురేశ్‌, సందీప్ నాయ‌ర్‌ల క‌స్ట‌డీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 24వ తేదీ వ‌ర‌కు క‌స్ట‌డీని పొడిగించగా, ఆ ఆరోజుననే బెయిల్ అప్లికేష‌న్‌ను స్వీక‌రిస్తారు.