అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కీలకం భారత ఓటర్లు 

ఈ సంవత్సరం నవంబర్ లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భారత సంతతి ఓటర్లు కీలకం కానున్నట్లు భావిస్తున్నారు. వారి ప్రభావం ఎక్కువగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలలో ఆ విధంగా జరిగిన్నట్లు ఈ సందర్భంగా చూపుతున్నారు. 
 
అమెరికాలో ఉంటున్న భారతీయులను ఆకట్టుకుంటే తమ విజయం సులువవుతుందని అక్కడి రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్‌ పార్టీ, డెమొక్రాటిక్‌ పార్టీలు భావిస్తున్నాయని చెబుతున్నారు. ఎప్పుడూ డెమొక్రాట్లకు అండగా నిలిచే భారత సంతతి ఓటర్లు ఈ సారి రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారన్న అంచనాల నేపథ్యంలో వీరిని ఆకట్టుకునేందుకు  రెండు పార్టీలూ తీవ్రంగా కృషిచేస్తున్నాయి.   
 
ఈ ఎన్నికలలో కీలకంగా భావిస్తున్న మిచిగన్, పెనిసిల్వేనియా, విస్కాన్సిన్, అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, టెక్సాస్ రాష్ట్రాల్లో భారత సంతతి ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉందని నేతలు చెప్తున్నారు. ఈ 8 రాష్ట్రాల్లో మొత్తంగా 13 లక్షల మంది భారత సంతతి ఓటర్లు ఉన్నారని అంటున్నారు. 
 
‘‘మిచిగన్ లో 1.25 లక్షల మంది భారత సంతతి ఓటర్లు ఉన్నారు. మేం 2016లో ఇక్కడ 10,700 ఓట్ల తేడాతో ఓడిపోయాం’’ అని ఓ కార్యక్రమంలో డెమొక్రటిక్ నేషనల్ కమిటీ చైర్మన్ థామస్ పెరెజ్ చెప్పారు.  ‘‘పెన్సిల్వేనియాలో 1.56 లక్షల భారత సంతతి  ఓటర్లున్నారు. మేం 42 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. అలాగే విస్కాన్సిన్ లో 37 వేల భారత సంతతి ఓట్లున్నాయి. మేం 21 వేల ఓట్ల తేడాతో లాస్ అయ్యాం’’ అని పెరెజ్ వివరించారు. 
 
2020 ఎన్నికలలోనూ భారత సంతతి, ఆసియా సంతతి, ఓటర్లే విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.  2016లో 77 శాతం మంది భారత సంతతి ఓటర్లు హిల్లరీకి అనుకూలంగా ఓటేశారని, ఇప్పుడు ట్రంప్ కన్నా ఆయన ప్రత్యర్థి బిడెన్ వైపే భారత సంతతి ఓటర్లు  మొగ్గు చూపే అవకాశం ఉందని ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ భావిస్తున్నారు. 
 
అయితే, మిచిగన్, ఫ్లోరిడా, టెక్సాస్, పెన్సిల్వేనియా వంటి పలు రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్న భారత సంతతి ఓటర్లు భారీ ఎత్తున రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గుతున్నారని, వారు ట్రంప్ కే ఓటేసే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి.