ఎడిబి ఉపాధ్య‌క్షుడిగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ లావాసా

భార‌త ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఏషియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి)‌ ఉపాధ్యక్షునిగా నీయమితులైన్నట్లు  మ‌నీలాలోని ఎడిబి ప్ర‌ధాన కార్యాల‌యం ప్రకటించింది. ఎడిబి ప‌బ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌షిప్స్‌కు, ప్రైవేట్ సెక్టార్ ఆప‌రేష‌న్స్‌కు ఉపాధ్యక్షుడిగా  అశోక్ లావాసా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. కాగా, త‌న‌ పదవీ కాలం ముగియకముందే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి త‌ప్పుకున్న రెండో ఎన్నిక‌ల‌ కమిషనర్‌‌గా అశోక్ లావాసాను చెప్ప‌వ‌చ్చు.

1973లో ప్రధాన ఎన్నికల  కమిషనర్‌‌గా ఉన్న నాగేంద్రసింగ్ హేగ్‌లోని ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్ జస్టిస్‌లో జడ్జిగా నియమితులై ఎల‌క్ష‌న్ కమిషనర్‌‌ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు దాదాపు 47 ఏండ్ల త‌ర్వాత అశోక్ లావాసా సైతం ప‌ద‌వీకాలం ముగియ‌క‌ముందే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి త‌ప్పుకుంటున్నారు.

అశోక్ లావాసా 180 బ్యాచ్‌కు చెంద‌ని హ‌ర్యానా క్యాడ‌ర్ ఐఏఎస్ అధికారి. రిటైర్డ్‌ ఐఏఎస్ అయిన ఆయ‌న 2018 జనవరిలో ఎన్నికల కమిషనర్‌‌గా నియమితులయ్యారు. ఆయ‌న ప‌ద‌వీకాలం ఇంకా రెండేండ్లు మిగిలి ఉండ‌గానే ఎల‌క్ష‌న్ ప్యానెల్ నుంచి త‌ప్పుకోబోతున్నారు. 

అశోక్ లావాసాకు ప్రైవేట్ సెక్టార్ ఆప‌రేష‌న్స్‌పైనా, ప‌బ్లిక్ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌షిప్స్‌పైనా సుదీర్ఘ అవ‌గాహ‌న ఉండ‌టంతో ఉపాధ్య‌క్షుడి నియ‌మించినట్లు ఎడిబి త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.