కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్టు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో 1980 దశకంలో ఉద్యమం ప్రారంభమైంది. 1990 ప్రారంభం నుంచి ముద్రగడ కాపు నాయకునిగా ఎదిగారు. 2016 జనవరి 30న తుని ఘటనతో ఉద్యమం మరింత ఉధృతమైంది.
ఆ తర్వాత తన సొంత గ్రామం కిర్లంపూడి కేంద్రంగా వివిధ సందర్భాల్లో నిరసనలు చేపట్టారు. కాపు రిజర్వేషన్ కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పలుమార్లు ఆయన కాపు రిజర్వేషన్ కోసం లేఖలు సంధించారు. కాపు రిజర్వేషన్ అంశంలో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి లేఖలు కూడా రాశారు.
కానీ, ఇప్పుడు అనూహ్యంగా తనపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు మనస్తాపం చెంది ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు ముద్రగడ తన లేఖలో తెలిపారు. ఇటీవల ముద్రగడ తీరును కాపు సామాజిక వర్గంలో కొందరు నేతలు విమర్శిస్తున్నారు. జగన్ సర్కారు అధికారంలోకొచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ అంశంపై ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా జనసేన పార్టీలో కొందరు క్రియాశీలక కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ముద్రగడపై విమర్శలు చేస్తున్నారు. తాను కాపు ఉద్యమం నుంచి వైదొలగడానికి ఆ అంశాలే కారణమని ముద్రగడ తెలిపారు.

More Stories
వచ్చే 50 ఏళ్లకు ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే
త్వరలో టీటీడీ స్థానిక ఆలయాల్లో దశలవారీ శ్రీవారి సేవ