రూ 330 కోట్ల నీరవ్ మోదీ ఆస్తుల జప్తు 

వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం నిందితుడు నీరవ్ మోడీకి చెందిన రూ. 330 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నీరవ్ మోడీకి చెందిన పలు ఆస్తులను జప్తు చేయాలని ముంబై కోర్టు జూన్ 8న తీర్పునిచ్చింది. ఆ ఆదేశాల అనుసారం ముంబై, లండన్, యుఏఈలలోని ఫ్లాట్లతో సహా రూ. 330 కోట్ల  విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. 

ఈడీ గతంలో నీరవ్ మోడీకి చెందిన రూ .2,348 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.ముంబై వర్లిలోని సముద్రా మహల్ లో ఉన్న ఫ్లాట్లు, మహారాష్ట్ర అలీబాగ్‌లోని సీ సైడ్ ఫామ్ హౌస్, రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని విండ్ మిల్లు, లండన్‌లోని ఒక ఫ్లాట్ మరియు యుఏఈలోని ఫ్లాట్లు ఈడీ ఈ రోజు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి.

నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీ నియంత్రణలో హాంగ్ కాంగ్ లో ఉన్న సంస్థలకు చెందిన ఆభరణాలు, రత్నాలను ఈడీ గత నెలలో స్వాధీనం చేసుకుంది. వాటిలో పాలిష్ చేసిన వజ్రాలు, ముత్యాలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ సుమారు రూ 1,350 కోట్లు కాగా, బరువు 2,340 కిలోలు.

గత ఏడాది డిసెంబర్ 5న ముంబై కోర్టు నీరవ్ మోడిని, మెహుల్ చోక్సీని దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్థులుగా ప్రకటించింది. సీబీఐ దర్యాప్తు ప్రారంభించడానికి ముందు వీరిద్దరూ 2018లో భారతదేశం నుండి పారిపోయారు.

49 ఏండ్ల నీర‌వ్ మోదీ ప్ర‌స్తుతం యునైటెడ్ కింగ్ డ‌మ్‌లోని జైల్లో ఉన్నాడు. 2019 మార్చిలో లండ‌న్‌లో అరెస్ట‌యిన‌ప్ప‌టి నుంచి మోదీ జైల్లో గ‌డుపుతున్నాడు. మరో నిందితుడు మెహుల్ చోక్సీ ఇప్పుడు ఆంటిగ్వాలో ఉంటున్నాడు. తన ఆరోగ్యం సరిగా లేనందున భారత్ కు  రాలేకపోతున్నానని ఆయన చెబుతున్నాడు.