విధ్వంసపూరిత నమూనా మార్చడానికే స్వదేశీ 

ప్రకృతి విధ్వంసపూరిత అభివృద్ధి నమూనాను మార్చడానికే, స్వదేశీ స్వావలంబన ఉద్యమాన్ని దేశం మొత్తంలో స్వదేశీ జాగరణ మంచ్ ప్రారంభించినట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  సహ-సర్-కార్యవాహ వి. భాగయ్య తెలిపారు.  

స్వదేశీ స్వావలంబన్ అభియాన్ సమన్వయకర్త సతీష్ కుమార్  వ్రాసిన ‘స్వదేశీ స్వావలంబన్ కి ఓర్  భారత్’ (హిందీ), ‘ఇండియా మార్చింగ్ టువర్డ్స్ స్వదేశీ అండ్ సెల్ఫ్ రిలయన్స్’ ని (ఇంగ్లీష్) గ్రంధాలను ఆన్‌లైన్లో హైదరాబాద్ నుండి ఆవిష్కరిస్తూ స్వదేశీ ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని స్పష్టం చేసారు.

స్వదేశీ శాంతి, శ్రేయస్సు, భద్రతను ప్రోత్సహించే, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు, స్వదేశీ అనేది ఈశ్వరీయ కార్యం అని ఆయన పేర్కొన్నారు.  సంఘ భావజాల సంస్థలతో పాటు, గాయత్రీ పరివార్, జగ్గీ వాసుదేవ్ జీ మహారాజ్, శ్రీ శ్రీ, మరి అనేక ఇతర సంస్థలు ఈ ప్రచారాన్ని తమ ప్రచారంగా భావించి ముందుకు సాగుతున్నాయని వివరించారు.

ఏప్రిల్ 26 న ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్  కూడా స్వదేశీ పిలుపునిచ్చారని తెలుపుతూ గడిచిన 250 సంవత్సరాలు మినహా, భారతదేశం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ఆధారిత దేశంగా గొప్పగా వెలసిల్లిందని గుర్తు చేశారు.

తెలంగాణ గ్రామాల నుండి ఇంగ్లాండ్‌కు ఉక్కు, బెంగాల్, తమిళనాడు గ్రామాల నుండి బట్టలు ఎగుమతి అయ్యేవని తెలిపారు. ఇటీవల, విజయవాడలోని ఒక సంస్థ 5 కోట్ల విలువైన ఆవు ఆధారిత ఉత్పత్తులను విజయవంతంగా ఉత్పత్తి చేసిందని  భాగయ్య వెళ్ళడించారు.

స్వదేశీ ప్రచారం ముఖ్య లక్షం గ్రామాలను కేంద్రీకృతం చేసుకొని  వ్యవసాయాన్ని అధారంగా ఉంచి అభివృధి పథంలో ముందుకు సాగడమేనని అని స్పష్టం చేశారు. అంతేకాక, స్వయం ప్రతిపత్తి, స్వదేశీ పట్ల ప్రభుత్వ ఆలోచనలలో మార్పుతేవడం, ప్రభుత్వ విధానాలలో ప్రతిబింబింపచేసే విధంగా చేయడమే స్వదేశీ యొక్క ముఖ్య ఉద్దేశం అని భాగయ్య వివరించారు.

అభివృద్ధి పథంలో, ఆర్థిక రంగంలో ముందుకు దూసుకపోవడానికి, మానవుల అవసరాలను  తీర్చడానికి ప్రకృతిని విచక్షణా రహితంగా దోపిడి చేసే సిద్ధాంతాలు సృష్టించబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి కారణంగా  ప్రపంచం, అపనమ్మకం, అరాచకం, అసంతృప్తిని ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రస్తుతం, ఇటువంటి సంక్షోభ భరిత వ్యవస్థ నుండి పూర్తిగా బయటకు రావడానికి ప్రపంచం అడుగులు వేస్తోందని తెలిపారు.

స్వదేశీ జాగరణ మంచ్ అఖిలభారత సంఘటక్ కాశ్మిరిలాల్, అఖిల భారత కన్వీనర్ సుందరం, పుస్తక రచయిత సతీష్ కుమార్ లు పాల్గొన్నారు. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ భగవతి ప్రకాష్ శర్మ పుస్తక పరిచయం చేశారు.