సెలబస్‌ 25 శాతం మేర తగ్గింపు 

కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌ (సీఐఎస్‌సీఈ), ఇండియన్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ (ఐసీఎస్‌ఈ), ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌(ఐఎస్‌సీ) సెలబస్‌ను 25 శాతం మేర తగ్గించింది. 2020-21 విద్యా సంవత్సర సిలబస్‌ను 25 శాతం తగ్గించింది. సవరించిన సిలబస్‌ అధికారిక వెబ్‌సైట్‌ cisce.org లో లభిస్తుంది. 9 నుండి 12వ తరగతుల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుండి తాజా సిలబస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
దేశవ్యాప్త లాక్‌డౌన్‌, కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా పాఠశాలలు గత మూడు నెలలుగా మూసివేయబడ్డాయి. అయినప్పటికీ సీఐఎస్‌సీఈ అనుబంధ పాఠశాలలు ఆన్‌లైన్‌ మోడ్‌లో తరగతులను తాత్కాలికంగా నిర్వహిస్తున్నాయి.
 
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను తగ్గించింది. 2020-21 విద్యాసంవత్సరాన్ని కుదించింది. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోకుండా సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. 
 
కాగా, జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(జేఈఈ) మెయిన్స్‌, అదేవిధంగా నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్‌ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 
 
నిపుణుల బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం వెలువరించినట్లు తెలిపారు. 
 
నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13వ తేదీకి వాయిదా పడగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబర్‌ 27వ తేదీకి వాయిదా పడింది. సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థుల భద్రత, విద్య రెండూ ముఖ్యమేనని హెచ్‌ఆర్డీ మంత్రిత్వశాఖ పేర్కొంది.