చైనా విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం!

భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. చైనా విద్యుత్తు పరికరాల దిగుమతిపై నిషేధం విధించే చర్యలు చేపట్టింది. సరైన అనుమతి లేకుండా చైనా, పాకిస్థాన్ నుంచి ఎలాంటి విద్యుత్తు పరికరాలను దిగుమతి చేసుకోకూడదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. 
 
చైనా, పాకిస్థాన్ దేశాలు మన దేశంలోకి చొరబడి మన సైనికులను చంపుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆయా దేశాల నుంచి దిగుమతుల వల్ల అక్కడ మాత్రమే ఉద్యోగాల కల్పన జరుగుతున్నదని, మన దేశంలో కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో చైనా, పాకిస్థాన్ దేశాల దిగుమతులను అనుమతి పొందాల్సిన జాబితాలో చేర్చినట్లు ఆర్కే సింగ్ చెప్పారు. 
 
దేశీయ విద్యుత్తు పరికరాల తయారీ పరిశ్రమల ప్రతినిధులతో ఇటీవల జరిగిన సమావేశంలో వారికి ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ విద్యుత్తు వ్యవస్థకు అవసరమైన అన్నింటినీ మనం సొంతంగా తయారు చేసుకొంటున్నామని తెలిపారు. 
 
మన దేశానికి ఆ శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని, విద్యుత్తు పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు. 2018-19లో రూ.71 వేల కోట్ల విలువైన విద్యుత్తు పరికరాలను దిగుమతి చేసుకున్నామని చెబుతూ వాటిల్లో చైనా దిగుమతులు రూ.21 వేల కోట్లు అని ఆర్కే సింగ్ వివరించారు.