దేశంలో ఉగ్రదాడుల కోసం ఐఎస్‌ఐ పన్నాగం 

ఒక వంక సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, మరోవంక దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటులను ప్రోత్సహించడం ద్వారా ఉగ్ర దాడులు జరపాలని పాకిస్థాన్ ఐఎస్‌ఐ పధకం వేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. 
 
ఇండో–భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతోపాటు గత నెలలో నేపాల్‌ సహితం కాల్పులకు పాల్పడటంతో మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని పెంచారు. బిహార్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌‌ రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. 
 
ఈ నెల 22న పైన పేర్కొన్న రాష్ట్రాలకు ఏజెన్సీలు మేజర్ అలర్ట్స్ జారీ చేశాయని తెలిసింది. తాలిబన్, జైష్ టెర్రరిస్టుల సాయంతో భారత్ లో పెద్ద ఉగ్రదాడుల కోసం పాకిస్తాన్ ఐఎస్‌ఐ పధకం చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వారి ముఖ్య లక్ష్యం ఢిల్లీ అని, అలాగే దేశ రాజధానిలోని కీలక రాజకీయ నేతలనూ టార్గెట్‌గా చేసుకున్నారని తెలుస్తున్నది. 
 
జమ్మూ కాశ్మీర్‌‌లోని నియంత్రణ రేఖ  గుండా చొరబడటానికి 20 మంది ఉగ్రవాదులు యత్నిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే బిహార్‌‌లోని భారత్ –నేపాల్ సరిహద్దు ద్వారా కూడా ఉగ్రవాదుల బృందం చొరబడొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలలో చొరబాట్లను విఫలం చేయడానికి పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని భద్రతా దళాలకు భారత ప్రభుత్వం ఆదేశించిందని తెలిసింది.