20 ఏళ్లుగా 6.60 లక్షల కేసులు పెండింగ్ 

దేశవ్యాప్తంగా హైకోర్టులు, జిల్లా, తాలూకా కోర్టుల్లో పదేళ్లుగా 3.70 లక్షల కేసులు విచారణకు నోచుకోలేదని నేషనల్‌ జ్యుడిషియల డేటా గ్రిడ్‌ (ఎన్‌జెడిజి) ప్రకటించింది. జిల్లా, తాలూకా కోర్టుల్లో 2.80 లక్షల కేసులు, హైకోర్టుల్లో 90వేల కేసులు ఉన్నాయని, వీటిలో 6.60 లక్షల కేసులు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండగా, మూడు దశాబ్దాలకు పైగా 1.31 లక్షల కేసులు విచారణకు నోచుకోలేదని తెలిపింది. 

మొత్తం 37.10 లక్షల కేసుల్లో పది శాతం అంటే 30.70 లక్షల  కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలో పేర్కొంది. కాగా, జూన్‌ 15న సుప్రీంకోర్టు ఒక హత్య కేసుకు సంబంధించిన నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ విచారిస్తున్న సమయంలో ఈ పెండింగ్‌ కేసుల అంశం వెలుగులోకి వచ్చింది. 

 క్రిమినల్‌ కేసులపై దీర్ఘకాలికంగా విచారణ చేపట్టకపోవడం న్యాయవ్యవస్థకు సవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ పిటిషన్‌లకు ు సంబంధించిన సమగ్రమైన నివేదికలను సమర్పించాలని అలహాబాద్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పాట్నా, ఒరిస్సా, ముంబయి హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

జిల్లా, తాలూకా స్థాయిలో పెండింగ్‌లో ఉన్న 5 లక్షల కేసుల్లో 1.5 శాతం కేసులు రెండు దశాబ్దాలకు పైగా, 85,141 కేసులు మూడు దశాబ్దాలకు పైగా కోర్టుల్లోనే మూలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మొత్తం 85,141 కేసుల్లో ఒక్క యుపిలోనే 40 శాతం అంటే 34 వేల కేసులు 30 ఏళ్లుగా మూలనపడిఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో యుపిలోని అలహాబాద్‌ హైకోర్టులోనే అత్యధికంగా కేసులు పెండింగ్‌లో పడి ఉన్నాయి.