పరిపాలన పట్టించుకోని ఉద్ధవ్… మిత్రపక్షాల్లో అసహనం

ఎటువంటి పరిపాలన అనుభవం, కనీసం శాసన సభా వ్యవహారాల  అనుభవం లేకుండా మహారాష్ట్రలో  నేరుగా ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అధికారులకు పాలనను వదిలివేస్తుండటం మిత్రపక్షాలతో అసహనం కలిగిస్తున్నది. చివరకు సొంత పార్టీ నేతలు సహితం తమాయించుకోలేక పోతున్నారు. 

ముఖ్యమంత్రి తన కార్యాలయంలో గాని లేదా అధికారిక నివాసంలోగాని అందుబాటులో ఉండడం లేదు. రాత్రి 11 గంటలు దాటితే టెలిఫోన్ లో కూడా లభించడం లేదు. అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజోయ్ మెహతా నిజమైన అధికార కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆమోదిస్తే గాని ఫైళ్లపై ముఖ్యమంత్రి సంతకం చేయడం లేదు. 

గతంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలలో కూడా పనిచేసిన మెహతాకు రాజకీయ వర్గాలలో మంచి పలుకుబడి ఉన్నట్లు చెబుతుంటారు. ఆయన సలహాలపైననే ఎక్కువగా ముఖ్యమంత్రి ఆధారపడుతున్నారని, రాజకీయ సలహాలకు ఎదురు చూడడంలేదని సహచరులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్స్ నేతలు అసహనం వ్యక్తం  చేయడానికి ఇదే ప్రధానమైన కారణంగా తెలుస్తున్నది. 

విశేష పాలననుభవం గల ఎన్సీపీ అధినేత శరద్ పవర్ నాలుగైదు సార్లు అధికారులపై ఎక్కువగా ఆధారపడటం మంచిది కాదని సున్నితంగా మందలించినట్లు చెబుతున్నారు. ఉదాహరణకు, కేంద్రం స్వదేశీ విమానాలు నడపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు థాకరే ఆలస్యం చేయాలి అనుకున్నారు. 

అధికారుల సలహాపై రెండు రోజుల వరకు విమానాలను ముంబైలోకి అనుమతిపలేదు. లాక్ డౌన్ ను సడలించడమే ఆర్ధిక వ్యవహారాలను పునరుద్ధరించడానికి ఏకైక మార్గమని ఈ సందర్భంగా శరద్ పవర్ సున్నితంగా వారించినట్లు తెలుస్తున్నది. 

దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి ముంబై నగరంపై ఎక్కువగా ప్రభావం చూపిన సమయంలో, దేశ ఆర్ధిక రాజధానిగా పేరొందిన నగరంలోని పారిశ్రామిక వేత్తల సహకారాన్ని స్వీకరించడంలో థాకరే విఫలం అయిన్నట్లు కనబడుతున్నది. 

రాజకీయ పరిణితి లేకపోవడం కారణంగానే ఆ విధంగా జరిగిన్నట్లు స్పష్టం అవుతున్నది. సహాయ, ఆర్ధిక సేవల కార్యక్రమాలలో వారికి కీలక పాత్ర అప్పచెప్పి ఉంటె ప్రభుత్వంపై భారం తగ్గడంతో పాటు,  మరింత వేగంగా పనులు జరిగేవని పలువురు భావిస్తున్నారు. 

థాకరే ఎక్కువగా తన నివాసానికి పరిమితం అవుతున్నారు. ఎక్కడ పర్యటనలు చేస్తున్న దాఖలాలు లేవు. ఈ మధ్య నిసర్గ తుఫాన్ రాష్ట్రాన్ని వణికించిన సమయంలో ఆయన దాదాపు ప్రేక్షక పాత్ర వహించారు. కేవలం  రాయగడ జిల్లాలో విమానం నుండే ఒక సారి చూసి వచ్చి ఊరుకున్నారు. అదే కాన్సర్ కు గురై కోలుకున్న  79 ఏళ్ళ శరద్ పవర్ అయితే తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో విస్తృతంగా సుడిగాలి పర్యటనలు జరిపారు.