త్వరలో జగన్ మంత్రివర్గ విస్తరణ 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తున్నది. దానితో వైసిపిలో మంత్రిపదవులు ఆశిస్తున్నవారిలో కదలిక ఏర్పడింది. కొందరు మంత్రుల శాఖలను సహితం ఈ సందర్భంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. 

ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తాజాగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడంతో వారిద్దరితో ఖాళీ అయ్యే మంత్రి పదవులతో పాటు, మరింకా అవకాశం ఉన్న మరో రెండు పదవులను కూడా భర్తీ చేయగలరని భావిస్తున్నారు. అంటే నలుగురి వరకు కొత్తగా మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

రాజ్యసభకు ఎన్నికైన వారిద్దరూ బిసి వర్గాలకు చెందిన వారు కావడంతో ఆ వర్గాల నుండి ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వగలరని ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌ (సతీష్‌), శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస ఎ మ్మెల్యే సీదిరి అప్పలరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

వాస్తవానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన సమయంలో రెండన్నర ఏళ్ల వరకు మంత్రివర్గంలో మార్పు ఉండబోదని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తానని కూడా ప్రకటించారు. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ స్థానాల వరకు సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా, గుంటూరు జిల్లా నుంచి మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా ఉన్నారు. రాంబాబు ప్రస్తుతం పార్టీకి కీలక అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు గత సంవత్సరంగా మంత్రుల పనితీరును పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కొందరి శాఖలు కూడా పెద్దఎత్తున మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గానికి ఓకే కొత్తరోపు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.