50 వేల టెస్ట్ లన్న కేసీఆర్… ల్యాబ్ లు లేవే!

గ్రేటర్  హైదరాబాద్ పరిధిలో కరోనా అదుపు తప్పుతున్నదని, ప్రభుత్వం టెస్ట్ లు సరిగ్గా చేయడం లేదని సర్వత్రా విమర్శలు చెలరేగడంతో వారం, పది రోజులలో ఇక్కడ 50 వేల టెస్ట్ లు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు మాటలు చెప్పడమే గాని టెస్ట్ లు చేసే సామర్ధ్యాన్ని పెంచక పోవడంతో అన్ని టెస్ట్ లు చేసే సామర్ధ్యంపై అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం రోజులు 2,000కు మించి టెస్ట్ లు చేసే సామర్ధ్యం హైదరాబాద్ లో లేదు. దానితో కేసీఆర్ చెప్పిన్నట్లు 50,000 టెస్టులు చేయాలి అంటే 25 రోజులు – అంటే సుమారు నెల రోజులు పడుతుంది. కేసీఆర్ చెప్పిన్నట్లు 10 రోజులలో 50,000 టెస్టులు చేయాలి అంటే రోజుకు 5,000 టెస్టులు చేయవలసి ఉంటుంది. దానితో ప్రభుత్వమే ప్రైవేట్ ల్యాబ్ లపై ఆధారపడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. 

టెస్టులు చేయాలి అంటే భారత వైద్య మండలి (ఐసిఎంఆర్) అనుమతి తప్పనిసరి కాగలదు. కానీ హైదరాబాద్ ఆ విధంగా అనుమతి గల ప్రభుత్వ ల్యాబ్ లు 10 మాత్రమే ఉన్నాయి. నగరంలో ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్ లు 18 వరకు ఉండడం గమనార్హం. వీటిలో టెస్ట్ ల సామర్ధ్యం రోజుకు 2,500 వరకు ఉండే అవకాశం ఉంది. 

వీటిల్లో ఇప్పటి వరకు అనధికారికంగా టెస్టులు చేస్తున్నా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించి, అనుమతి ఇవ్వడంతో ఒకటి, రెండు రోజులలో అధికారికంగా టెస్టులు ప్రారంభించే అవకాశం ఉంది. నిమ్స్ లో రోజుకు 3,000 వరకు టెస్టులు చేయగల  ‘కోబాస్ ‌8800’అనే భారీ యంత్రంతో ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నా అక్కడ టెస్టులు చేయడానికి మరింత సమయం అవసరం అని చెబుతున్నారు.