చిరు వ్యాపారులకు ఊరట కల్పించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకొన్నది. రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్నవారు ఆలస్యంగా చెల్లించే పన్నుపై వడ్డీని సగానికి (18 శాతం నుంచి 9 శాతానికి) తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన పన్ను చెల్లింపులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.
అలాగే మే, జూన్ నెలల జీఎస్టీ రిటర్నుల దాఖలుకు గడువును సెప్టెంబర్ వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ 2017 జులై నుంచి 2020 జనవరి వరకు ఎలాంటి పన్ను బకాయిలు లేకుండా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారికి ఆలస్య రుసుము విధించబోమని తెలిపారు.
పన్ను బకాయిలు ఉండి, 2017 జులై-2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి వసూలుచేసే గరిష్ఠ ఆలస్య రుసుమును రూ.500కు తగ్గించినట్టు తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య రిటర్నులు దాఖలు చేసేవారి నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తామని పేర్కొన్నారు. పాదరక్షలు, ఎరువులు, టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీ తగ్గించాలని యోచిస్తున్నామని, పాన్‌మసాలాపై విధించే జీఎస్టీపై తదుపరి సాధారణ సమావేశంలో నిర్ణయం తీసుకొంటుందని వివరించారు.
కాగా, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై సింగిల్ ఎజెండాతో జులైలో ప్రత్యేకంగా సమావేశమవుతామని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన జీఎస్టీ పరిహార బకాయిలను ఎలాంటి తగ్గింపులు లేకుండానే చెల్లించామని ఆమె గుర్తు చేశారు.
More Stories
భారత్కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
కేజ్రీవాల్పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కుంభమేళాతో ఉత్తర ప్రదేశ్ కు రూ.2 లక్షల కోట్లు ఆదాయం