అమర్‌నాథ్‌ యాత్ర ఈసారి 15 రోజులే

అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది 15 రోజులు మాత్రమే జరగనున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకే జరగనుందని అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) ప్రకటించింది. యాత్ర కేవలం ఒకే మార్గంలో సాగుతుందని, భక్తులకు కరోనా పరీక్షలు తప్పనిసరని కమిటీ వెల్లడించింది. సాధువులు మినహా, 55 ఏండ్లు పైబడినవారిని యాత్రకు అనుమతించమని తెలిపింది. యాత్రలో పాల్గొనాలనుకునేవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. యాత్రకు సంబంధించిన ప్రథమ పూజను శుక్రవారం  నిర్వహించారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈసారి యాత్ర కాలం కుదించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించేవారికి అధికారులు షరతులు విధించారు. 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యాత్రికులను మాత్రమే అనుమతిస్తామని, యాత్రకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుందని  స్పష్టం చేశారు. 
 
భక్తులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. అయితే సాధువులకు ఈ నిబంధనలు వర్తించవు. కాశ్మీర్ లోకి ప్రవేశించే ముందే అందరికీ టెస్టులు నిర్వహిస్తారు. 15 రోజులపాటు అమర్ ఉత్తర దేవాలయంలో  జరిగే హారతి కార్యక్రమాన్ని భక్తుల దర్శనార్థం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు.  
బేస్ క్యాంప్ నుంచి గుహ మందిరం వరకు ట్రాక్ నిర్వహణలో ఇబ్బందులు ఉన్నందున, గాండెర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి గుహ మందిరం వరకు హెలికాప్టర్లను ఉపయోగించి యాత్ర నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కేవలం ఉత్తర కాశ్మీర్ బల్తాల్ మార్గం ద్వారా మాత్రమే యాత్ర నిర్వహిస్తామని, పహల్గాం మార్గం ద్వారా ఈ సంవత్సరం యాత్ర చేపట్టడానికి ఏ యాత్రికుడిని అనుమతించబోమని  స్పష్టం చేశారు. 
 
రక్షా బంధన్ పండుగతో సమానమైన శ్రావణ పూర్ణిమ ఆగస్టు 3 న యాత్ర ముగుస్తుందని చెప్పారు.  జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తులోని హిమాలయ గుహల్లో ఉన్న మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి అమర్‌నాథ్‌ యాత్ర సాగుతుంది. ప్రతి ఏడాది 45 రోజులపాటు సాగే ఈ యాత్రను ఈసారి రెండు వారాలకు కుదించారు.