బిజెపి నేతలపై టిఆర్ఎస్ నేతల దౌర్జన్యాలు

తెలంగాణలో బిజెపి నాయకులు, కార్యకర్తల పైన టిఆర్ఎస్ నాయకులు, శాసనసభ్యులు, స్థానికంగా ఉండే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికార దురహంకారంతో దురుసుగా ప్రవర్తిస్తూ అధికార యంత్రాంగం తో దాడులు చేయిస్తుండటం పట్ల బీజేపీ శాసనమండలి పక్ష నేత ఎన్ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బిజెపి నాయకుల పైన చేసిన దాడులను కేసు నమోదు చేయాలని అనేక రోజులుగా పోరాటం చేసినా ప్రభుత్వం కేసు నమోదు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నదని మండిపడ్డారు. 

ఓ దళిత యువతిపై జరిగిన అకృత్యాలను ప్రశ్నించి సంబంధిత నిందితులను అరెస్టు చేయాలని బిజెపి  ఎస్. సి. మోర్చా జాతీయ కార్యదర్శి కుమారి బంగారు శ్రుతి  నిరసన తెలియజేస్తే మలక్ పేట్ శాసనసభ్యులు  బలాల అసభ్యంగా దూషించి దాడి చేసినా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి చివరకు నేడు కేసు నమోదు చేసిందని తెలిపారు. 

రాష్ట్రం తమ జాగీర్ లాగా టిఆర్ఎస్ ప్రభుత్వం   వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని స్పష్టం చేశారు. నిజాం ఆదర్శంగా తీసుకుంటాం అన్న కేసీఆర్ నిజంగా నియంతృత్వ పోకడలతో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం తెలంగాణ సమాజం తగిన సమయంలో బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. 

అదేవిధంగా రైతులు మార్కెట్ కు మామిడి పళ్ళ ను తీసుకురావడం మార్కెట్ మూసివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతుల సమస్యలను తెలుసుకోవడానికి విచ్చేసిన నాగర్ కర్నూల్ బిజెపి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు ను అసభ్య పదజాలంతో దూషించడం దాడి చేయడం తోపాటు రైతుల పైన లాఠీ ఛార్జ్ చేసారమని రామచంద్రరావు గుర్తు చేశారు. 

ఈ సంఘటనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోక పోవడమే కాకుండా,  రైతుల పైన, బిజెపి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు పైన కేసు నమోదు చేయడం పట్ల రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి బిజెపి ఫిర్యాదు చేసింది. దానితో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సీఐ పైన కేసు నమోదు చేసిన్నట్లున్నదని చెప్పారు. 

ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి యాచారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దళిత నాయకురాలు శ్రీమతి సుకన్య పట్ల దురుసు ప్రవర్తించడం తోపాటు దాడి చేశారని రావు ధ్వజమెత్తారు. అంతా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి తోనే టిఆర్ఎస్ శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని రామచంద్రరావు మండిపడ్డారు.

ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్న బీజేపీ కార్యకర్తల పై దాడులు దిగాలన్న ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని,  ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ ను గౌరవించాలని రావు డిమాండ్ చేశారు. 

Share: