70 మందితో తెలంగాణ బీజేపీ కొత్త కార్యవర్గం

బీజేపీ రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ శనివారం నియమించారు. కొత్త కార్యవర్గంలో సుమారు 70 మందికి చోటు కల్పించారు. పార్టీ సంస్థాగతంగా తెలంగాణలో మొత్తం 38 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడంతో జిల్లాకు ఇద్దరికి చొప్పున అవకాశం ఇచ్చారు. అన్ని జిల్లాల పార్టీ మాజీ అధ్యక్షులను కార్యవర్గ సభ్యులుగా నియమించారు. 

కరీంనగర్, నల్గొండ జిల్లాల బీజేపీ మాజీ  అధ్యక్షులు మినహా మిగతా అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకు కొత్త కార్యవర్గంలో చోటు దక్కింది. వీరితో పాటు రాష్ట్ర ఆఫీసు బేరర్లుగా అవకాశం రాని సుమారు 35 మందిని ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) మెంబర్లుగా నియమించారు. 

బండి సంజయ్ అధ్యక్షతన అదివారం కొత్త కార్యవర్గం సమావేశం జరగనుంది. బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన 9 నెలల తర్వాత రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుండడంతో బీజేపీ క్యాడర్ లో ఆసక్తి నెలకొంది. సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ మీటింగ్ కు బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. 

పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్​, మురళీధర్ రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అరవింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు,  అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు హాజరు కానున్నారు. 

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ, రెండు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించనున్నారు. 2023 లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనా ప్రధానంగా చర్చిస్తారు.