* భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని ట్రంప్ స్పష్టం
భారత్, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడంతో దానికి ప్రతిగా భారత్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌తో దాదాపు తుది దశలో ఉన్న 3.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 30,000 కోట్లు) కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల్లో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత నౌకాదళం కోసం ఆరు అధునాతన పీ-8ఐ పోసైడాన్ విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సముద్రంపై సుదూర నిఘా, జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ విమానాల ప్రత్యేకత.
వాస్తవానికి 2014లో ఈ ఒప్పందం విలువ 2.42 బిలియన్ డాలర్లుగా ఉండేది.
కానీ ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులో అంతరాయాలు, తాజాగా విడిభాగాలపై అమెరికా విధించిన 25 శాతం సుంకాల కారణంగా దీని ధర 3.6 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపు 50 శాతం పెరగడంతో భారత్ ఈ కొనుగోలుపై పునరాలోచనలో పడింది. తాజా అమెరికా సుంకాల కారణంగానే పీ-8ఐ విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన ఖర్చుతో పాటు, అమెరికా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం బోయింగ్ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించనుంది. భారత్‌లో బోయింగ్ సంస్థకు సుమారు 5000 మంది ఉద్యోగులు ఉండటంతో పాటు, ఏటా 1.7 బిలియన్ డాలర్ల మేర భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు, హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల అవసరం భారత నౌకాదళానికి ఎంతో ఉంది. ఇప్పటికే భారత్ వద్ద 12 పీ-8ఐ విమానాలు ఉన్నాయి.
వాటికి అదనంగా మరో ఆరింటిని సమకూర్చు కోవాలని భావించినా, తాజా పరిణామాలతో దేశీయంగా డీఆర్‌డీఓ, హెచ్ఏఎల్ వంటి సంస్థల ద్వారా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం రద్దు కానప్పటికీ, టారిఫ్ వివాదం పరిష్కారమయ్యే వరకు నిరవధికంగా నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇలా ఉండగా, వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్ ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించి తన అక్కసును వెళ్లగక్కారు.
భారత ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో స్పందిస్తుండటంతో ట్రంప్ మరింతగా రెచ్చిపోతున్నారు. సుంకాలపై వివాదం పరిష్కారమయ్యే వరకు భారతదేశంతో ఎటువంటి వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. 50 శాతం టారీఫ్‌ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశించారా? అని మీడియా అగిన ప్రశ్నకు ‘లేదు, వివాదం పరిష్కారం అయ్యేవరకు చర్చల ప్రసక్తే లేదంటూ సమాధానమిచ్చారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ, ‘భారత్- అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి’ అని పేర్కొన్నారు. అదనపు సుంకాల విషయంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నాయని ఒప్పుకున్నారు. అయితే భారత్‌తో తాము పూర్తి స్థాయి చర్చల్లో పాల్గొంటామని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు, వాణిజ్య ఒప్పందాలు లాంటి విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారని పిగోట్ పేర్కొన్నారు.
కాగా, భారత్‌పై మరో విడత ట్రారీఫ్‌లు వడ్డిస్తానని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చైనా కూడా చమురును కొంటున్నప్పటికీ, కేవలం భారత్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యం చేసుకున్నారని విలేకర్లు ప్రశ్నించినపుడు ట్రంప్ స్పందిస్తూ, “ఇప్పటికి ఎనిమిది గంటలే అయింది. చూద్దాం ఏం జరుగుతుందో” అన్నారు. “మీరు మరిన్ని చూడబోతున్నారు. మీరు తదుపరి ఆంక్షలను చూడబోతున్నారు” అని చెప్పారు.

More Stories
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం
2026 బెంగాల్ ఎన్నికలు భారతదేశ జాతీయ భద్రతా యుద్ధం
రాజీనామాకు దీదీ మొండికేయడంతో బెంగాల్ అసెంబ్లీ రద్దు