ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యత మోదీ, నడ్డలకే

ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యత మోదీ, నడ్డలకే

ఎన్డీఏ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా ఎంపిక చేసే బాధ్యతను ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగిస్తూ ఎన్డీఏ కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సమావేశమై తీర్మానం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాకు వెల్లడించారు.  మొన్నటిదాకా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్‌ ధన్‌కఢ్‌ అనారోగ్య కారణాలతో ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక అనివార్యమైంది. 

ఈ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసిందని రోజుననే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తమ అభ్యర్థి ఎంపిక విషయమై సమావేశమయ్యాయి. గురువారం న్యూఢిల్లీలో పార్లమెంట్ చాంబర్‌లోని జేపీ నడ్డా కార్యాలయంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా  కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన కీలక నేతలు జేడీ (యూ) నుంచి లలాన్ సింగ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎల్‌జేపీ నుంచి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు.  

మరోవైపు ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం గురువారం అంటే ఆగస్ట్ 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పదవికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆగస్ట్ 21వ తేదీ చివరి తేదీగా ప్రకటించింది. ఇక 22వ తేదీన నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.