సుంకాలతో జిడిపి 0.5 శాతం తగ్గొచ్చు

సుంకాలతో జిడిపి 0.5 శాతం తగ్గొచ్చు

అమెరికా ప్రకటించిన అధిక సుంకాలు మన ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు ఆ తీవ్రత కనిపించకపోయినా మధ్య, దీర్ఘకాలానికిగాను భారత్‌పై ఈ ప్రభావం గట్టిగానే ఉండవచ్చని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. యుఎస్‌ సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి రేటులో 50 బేసిస్‌ పాయింట్ల (0.5 శాతం) తగ్గుదలను చవి చూడనుందని ఆయన చెప్పారు.

ఇది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఓ ఇంటర్యూలో సుబ్బారావు  ఆందోళన వ్యక్తం చేశారు. ”భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులపై ఉంది. 50 బేసిస్‌ పాయింట్ల వృద్ధి తగ్గుదలను ఒక సంవత్సరం పాటు తట్టుకోగలదు. కానీ అది ఎక్కువ కాలం కొనసాగితే ముఖ్యంగా ఎగుమతులు, ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్యం స్థిరత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.” అని సుబ్బారావు తెలిపారు.

దేశ జీడీపీలో ఎగుమతుల వాటా దాదాపు 22 శాతంగా ఉందన్న ఆయన ఇందులో 17 శాతం అమెరికాకే ఎగుమతి అవుతున్నట్టు గుర్తుచేశారు. కాబట్టి ఈ సుంకాలతో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) భారత జీడీపీ అర శాతం (50 బేసిస్‌ పాయింట్లు) తగ్గిపోవచ్చని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీ 6.5 శాతంగా నమోదైన దృష్ట్యా ఈసారి అది 6 శాతానికి పరిమితం కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వృద్ధిరేటు కూడా తీసిపారేయదగినదేమీ కాదన్న ఆయన  సుంకాల భారం ఇలాగే కొనసాగితే మాత్రం ఏటా అర శాతం చొప్పున దేశ జీడీపీ వృద్ధిరేటు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  సుంకాల భారం పెరిగితే దేశీయ మెషినరీ, మెకానికల్‌ అప్లియెన్సెస్‌, రత్నాలు-ఆభరణాల వంటి కార్మిక ఆధారిత రంగాలు కుదేలవుతాయని సుబ్బారావు చెప్పారు.

ప్రస్తుతం భారత్‌ 7 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తోందని సుబ్బారావు తెలిపారు. ట్రంప్‌ విధించిన అధిక సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు భారత వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. యుఎస్‌ అధిక సుంకాలు ఎగుమతి ఆదాయాన్ని తగ్గించి, ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉందని తెలిపారు. 

అయితే, ఫార్మాస్యూటికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలు ఈ టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉండటం భారత్‌కు కొంత ఊరటనిస్తుందని చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్‌ కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని ఆయన సూచించారు. దేశీయ తయారీని ప్రోత్సహించాలని, ఇతర ఇంధన మార్కెట్లను అన్వేషించాలని సుబ్బారావు సూచించారు. ఆసియా, ఆఫ్రికా, యూరోపియన్‌ దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.