
బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రిజర్వేషన్ల అమలు బాధ్యతలు కూడా బీజేపీ మీదనే నెట్టివేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి ఢిల్లీలో ఆగస్టు 5,6,7 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలతో లాబీయింగ్, ధర్నాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలవడంతోపాటు ఇండియా కూటమి మద్దతు కోరాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, గవర్నర్కు పంపిన అర్డినెన్స్ ముసాయిదాపై చర్చ జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు తెలిసింది.
కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, 50% పరిమితిని తొలగించకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమని న్యాయ నిపుణులు సూచించినట్టు సమాచారం. ఇందుకోసం గతంలో సుప్రీంకోర్టులో వీగిపోయిన వివిధ రాష్ర్టాల కేసులను న్యాయ నిపుణులు ప్రస్తావించినట్టు సమాచారం. నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యక్రమంపై మంత్రులు తర్జనభర్జనపడ్డట్టు సమాచారం.
నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యక్రమంపై మంత్రులు తర్జనభర్జనపడ్డట్టు సమాచారం. దీనిపై సీఎం రేవంత్రెడ్డి కల్పించుకుంటూ మన చేతిలో ఉన్నంతవరకు చేశామని, కేంద్రం అడ్డుకుంటే మనమేం చేస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. చట్టపరంగా రిజర్వేషన్ల అమలుకు సాధ్యం కానప్పుడు పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిద్దామని సీఎం రేవంత్రెడ్డి సూచనను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది.
బీసీలకు ఇంతకాలం ఆశపెట్టి, తీరా ఎన్నికల వేళ పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే బీసీల నుంచి వ్యతిరేక వస్తుందని వారు హెచ్చరించినట్టు సమాచారం. 42% రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకుందామని సూచించినట్టు సమాచారం.
ఇప్పటికే ఎరువుల కొరత, పునాస కరువు తదితర కారణాలతో రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారని, దీనికితోడు బీసీ రిజర్వేషన్లు లేకుండా మొండిచెయ్యితో వెళ్తే నష్టపోతామని, క్షేత్రస్థాయిలో పరాభవం తప్పదని పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించినట్లు తెలిసింది. మంత్రుల సూచనలతో ఏకీభవించిన సీఎం రేవంత్రెడ్డి రిజర్వేషన్లు కొలిక్కి వచ్చిన తరువాతే ఎన్నికలకు వెళ్దామని, అప్పటివరకు ఎన్నికలను వాయిదా వేద్దామనే ఏకాభిప్రాయానికి మంత్రివర్గం వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే