చోళ సామ్రాజ్యం ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం

చోళ సామ్రాజ్యం ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం

చోళ సామ్రాజ్యాన్ని ప్రశంసిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేవి కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. “చోళ సామ్రాజ్యం భారతదేశ స్వర్ణ యుగాలలో ఒకటి అని చరిత్రకారులు నమ్ముతారు. చోళ సామ్రాజ్యం భారతదేశ ప్రజాస్వామ్య తల్లి సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లింది” అని తెలిపారు. 

తమిళనాడు అరియలూరులోని గంగైకొండ చోళపురం ఆలయంలో రాజేంద్ర చోళ-1 జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన ‘ఆది తిరువతిరై’ ఉత్సవం ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటూ చరిత్రకారులు ప్రజాస్వామ్యం పేరుతో బ్రిటన్ మాగ్నా కార్టా గురించి మాట్లాడుతారు కానీ చాలా శతాబ్దాల క్రితం, చోళ సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నికలు జరిగేవని చెప్పారు. 

“చోళ సామ్రాజ్యం చరిత్ర, వారసత్వం మన గొప్ప దేశం బలం, నిజమైన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. చోళ యుగం భారత చరిత్రలో స్వర్ణ యుగాలలో ఒకటి; ఈ కాలం దాని బలీయమైన సైనిక బలంతో విభిన్నంగా ఉంది” అని ప్రధానమంత్రి తెలిపారు.  చోళ యుగం నాటి ‘కుడవోలై వ్యవస్థ’ వందల సంవత్సరాల కిందటే ప్రజాస్వామ్యం గురించి తెలియజేసిందని, చోళుల కాలంలో ఉన్న ఈ వ్యవస్థ దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటిదని మోదీ తెలిపారు.

ఇతర ప్రదేశాలను జయించిన తర్వాత బంగారం, వెండి లేదా పశువులను తీసుకువచ్చే అనేక మంది రాజుల గురించి మనం విన్నామని, అయితే రాజేంద్ర చోళుడు గంగాజలాన్ని తీసుకువచ్చాడని ఆయన పేర్కొన్నారు. “నేటికీ, ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడే ఒక నిర్మాణ అద్భుతంగా నిలుస్తుంది. చోళ చక్రవర్తులు భారతదేశాన్ని సాంస్కృతిక ఐక్యత అనే దారంలో అల్లారు. నేడు, మన ప్రభుత్వం కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా చోళ యుగం అదే దృక్పథాన్ని ముందుకు తీసుకువెళుతోంది. శతాబ్దాల నాటి ఈ ఐక్యతా బంధాలను మేము బలోపేతం చేస్తున్నాము” అని ప్రధాని వివరించారు.

రాజరాజ చోళ, ఆయన కుమారుడు రాజేంద్ర చోళ-1లు భారతదేశ గుర్తింపు, గర్వానికి పర్యాయపదాలు అని చెబుతూ తమిళనాడులో వారి కోసం గొప్ప విగ్రహాలను నిర్మిస్తామని ప్రధాని ప్రకటించారు.  “చోళ రాజులు శ్రీలంక, మాల్దీవులు, ఆగ్నేయాసియా మొదలైన ప్రాంతాలతో దౌత్య, వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకున్నారు. నేను నిన్న మాల్దీవుల నుంచి తిరిగి ఇక్కడకు రావడం కేవలం యాదృచ్ఛికం. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం నా అదృష్టం” అని మోదీ చెప్పారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడి స్మారక నాణేన్ని విడుదల చేశారు. మోదీ ఈ కార్యక్రమంలో సంప్రదాయ ధోతి, చొక్క, మెడలో ధరించే అంగ వస్త్రాన్ని ధరించారు. ఆలయ పురోహితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా ఈ గంగైకొండ చోళపురం ఆలయం ఉంది. ఇందులో చోళుల కాలం నాటి అద్భుతమైన శిల్పాలు, శాసనాలు ఉన్నాయి.

వాస్తవానికి ఆది తిరువతిరై పండగను చోళ రాజులు గొప్పగా నిర్వహించేవారు. నేటికీ తమిళనాడులో దీనిని వైభవంగా జరుపుకుంటున్నారు. తమిళ శైవ మతానికి చెందిన 63 మంది నాయనార్లు ఇక్కడ అమరత్వం పొందారు. రాజేంద్ర చోళుడి జన్మ నక్షత్రం తిరువతిరై (ఆర్ద్ర) జులై 23న ప్రారంభమైంది. ఇది ఈ సంవత్సర పండుగకు మరింత ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చింది.

కాగా, భారతదేశం- తన సార్వభౌమాధికారంపై దాడి జరిగితే, ఎలా స్పందిస్తుందో ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి చూపించిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా కొత్త ఆత్మవిశ్వాసాన్ని సృష్టించిందని, దీని ద్వారా భారత్ బలం ప్రపంచానికి తెలిసిందని ఆయన తెలిపారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకునే శత్రువులకు, ఉగ్రవాదులకు ఇక ఇది ఏమాత్రం స్వర్గధామం కాదని ఆపరేషన్ సిందూర్ నిరూపించిందని స్పష్టం చేశారు.