
హిందూయేతర ఉద్యోగులపై నిఘా పెట్టామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. హిందూయేతర ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం జరిగింది. 45 అంశాలపై చర్చించారు.
ఆ అంశాలను ఇఒతో కలిసి మీడియాకు చైర్మన్ వెల్లడిస్తూ తిరుమలలో అన్ని విభాగాలూ ఒకేచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలనా భవన నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపిందని, వైకుంఠం క్యూకాంప్లెక్స్ -3 నిర్మాణానికి కమిటీ ఏర్పాటు అయ్యిందని చెప్పారు. “వసతి గదుల కోసం వేచి ఉండేవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చర్యలు చేపడతాం. టీటీడీ తరఫున దేవాలయాల విస్తరణపై ఆలోచనలు చేస్తున్నాం. శ్రీవారి సేవకు సంబంధించి చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాం. డిజిటల్, సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులకు జరిగే మోసాలను నివారించే అంశంపై చర్చించాం” అని తెలిపారు.
పాతబడిన హెచ్‌ఒడిసిలోని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్‌హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కల్యాణి సత్రాలను ఐఐటి నిపుణుల సూచన మేరకు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు ఏర్పాటుకు రూ.4.35 కోట్లు కేటాయించామని చెప్పారు. ఆగస్టు నుంచి అక్కడ మూడు పూటలా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామని చెప్పారు.
టిటిడి రవాణా శాఖలో 142 కాంట్రాక్టు డ్రైవర్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సులు పంపినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచేందుకు పాలకమండలిలో నిర్ణయించినట్లు చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేలా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. శ్రీవారి సేవను మరింత విస్తృతపరచి యాత్రికులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు నాలుగు కో-ఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
అన్నమయ్య జన్మించిన తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కడపలో వేల సంవత్సరాల చరిత్ర గల శివాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయనున్నట్లు శ్యామలరావు వివరించారు. నిరుద్యోగులైన వేద పారాయణదారులకు దేవాదాయ శాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2.16 కోట్ల నిధుల మంజూరుకు, శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులను మూడు కేటగిరీలుగా విభజించి రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలు చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 320 దేవాలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకుగాను ఒక్కో మైక్ సెట్ ఖర్చు రూ.25 వేలు ఉంటుందని శ్యామలరావు పేర్కొన్నారు. మరోవైపు ప్రవాసాంధ్రులకు వీఐపీ బ్రేక్ దర్శన కోటాను 10 నుంచి 100కు పెంచారు. రోజూ వంద బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రవాసాంధ్రులు ముందుగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్ వెబ్‌సైట్ https://apnrts.ap.gov.in/ లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుంది.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!