ఎనిమిదోసారి ఇండోర్‌ కు స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు

ఎనిమిదోసారి ఇండోర్‌ కు స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డు
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌ నగరం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ నగరాల జాబితాలో ఇండోర్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఈ నగరం మొదటి స్థానంలో నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ నేప‌థ్యంలో రాష్ట్రప‌తి ద్రౌపదీ ముర్ము ఆ న‌గ‌రానికి స్వచ్ఛ స‌ర్వేక్షన్‌ అవార్డును అందజేశారు. 
 
ఇక రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, మూడో స్థానంలో ముంబై మహా నగరం నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అవార్డులు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన వేడుకల్లో ‘స్వచ్ఛ’ జాబితాలో నిలిచిన నగరాలకు అవార్డులను ప్రదానం చేశారు.

3-10లక్షల జనాభా విభాగంలో, నొయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా మొదటిస్థానంలో నిలిచింది. చండీగఢ్‌, మైసూర్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మూడు లక్షలు-50,000 జనాభా విభాగంలో న్యూఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌, 20,000-50,000 జనాభా విభాగంలో విటా (మహారాష్ట్ర), 20,000 కంటే తక్కువ జనాభా విభాగంలో పంచగని అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా నిలిచాయి.

కేంద్రం ప్రకటించిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు దక్కింది. విశాఖపట్నం జాతీయస్థాయిలో స్పెషల్‌ కేటగిరీ మినిస్టీరియల్‌ అవార్డు దక్కించుకుంది. రాజమహేంద్రవరానికి రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్‌ అవార్డు లభించింది. స్వచ్ఛ సూపర్‌లీగ్‌ సిటీస్‌ విభాగంలో విజయవాడ, తిరుపతి, గుంటూరు ఎంపికయ్యాయి.