తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి జలాలపై ఇప్పటికే ఉన్న వివాదాలపై సాంకేతిక, పరిపాలన నిపుణులతో కమిటీ వేసి, పరిష్కారం చేసుకోవడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. సోమవారం లోగా ఈ కమిటీ ఏర్పాటు కానుంది
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై చర్చించడం కోసమే ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సమావేశం దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. కృష్ణా నది ప్రాజెక్టుల నుండి విడుదలవుతున్న నీటి లెక్కలు సేకరించడానికి టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలనూ తీసుకున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్రెడ్డితోపాటు కేంద్ర ప్రభుత్వ, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ, 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై ఇరు రాష్ట్రాలూ చర్చించాయి. ప్రాజెక్టును కాపాడుకోవటానికి నిపుణుల సూచనలు పాటించాలని నిర్ణయించారు.
అలానే కృష్ణా బోర్డును అమరావతిలో ఏర్పాటు చేయటంతో పాటు గోదావరి బోర్డును హైదరాబాద్లో కొనసాగించాలని భేటీలో నిర్ణయించారు. దీనికోసం అవసరమైతే మరోసారి సమావేశం కావాలని భేటీలో నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. పోలవరం-బనకచర్ల లక్ష్యాలను వివరణ అజెండాగా సమావేశంలో ఏపీ వాదనలు వినిపించింది. సముద్రంలో వృథాగా కలిసే జలాలే వినియోగిస్తామని వివరించింది. గోదావరిలో వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలపై ఏపీ అధికారులు వివరణ ఇచ్చారు.
అయితే, కేంద్ర జలశక్తి మంత్రి భేటీలో ఏపీ నుంచి బనకచర్ల కడతామన్న ప్రతిపాదన రాలేదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల అంశంపై ఈ భేటీలో అసలు చర్చ జరగలేదని పేర్కొన్నారు. ఈ భేటీలో నాలుగు అంశాలపైనే చర్చించామని వాటిపైనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణ గొడవలు పెట్టుకోవాలని కొందరు చూస్తున్నారని వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవడమే మా ఎజెండా అని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.

More Stories
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు: