
“గెలుపు బూత్‌లోనే జన్మిస్తుంది” అనే ధోరణితోనే ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సూచించారు. ఘట్కేసర్ డివిజన్/ మండల్ అధ్యక్షుల కార్యశాల ముగింపులో మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీ ప్రాణం, వారిని గుర్తించాలి, గౌరవించాలి, ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ప్రతి డివిజన్, మండల స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపిచ్చారు.
ఒక్కొక్క బూత్ గెలిస్తే – ఒక్కొక్క నియోజకవర్గం మనదవుతుందని, ఒక్కొక్క నియోజకవర్గం మనదైతే తెలంగాణ మనదవుతుందని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి బ్యాంక్ ఖాతా అందించడమే కాదు, ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా మార్చిందని రామచందర్ రావు చెప్పారు. ప్రధానమంత్రి జనధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పౌరులకు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించామని తెలిపారు.
ఈ ఖాతాల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమవుతోందని, దాంతో దళారుల అవినీతి పూర్తిగా తొలగిపోయిందని స్పష్టం చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక భారీ కుంభకోణాలు చోటుచేసుకోగా, ప్రజాసంక్షేమం విస్మరించారని విమర్శించారు.
మోదీ ప్రభుత్వ హయాంలో అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా వంటి పథకాల ద్వారా ప్రతి పేదవాడికి బీమా భద్రత లభిస్తోందని చెప్పారు.
ఈ పథకాల కింద తెలంగాణలోనే 48 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొంటూ అంటే దాదాపు కోటి 50 లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ పథకాల ప్రయోజనాన్ని పొందుతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు, స్వయం ఉపాధికి వడ్డీ లేని లేదా తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తోందని గుర్తు చేశారు. ఈ పథకం వల్ల లక్షలాది మంది యువత ఆర్థికంగా స్వావలంబులవుతూ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు వృద్ధిని ప్రేరేపించే చర్య
చరిత్రలో తెలంగాణ విమోచనకు అత్యంత ప్రాముఖ్యత
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు