మతమార్పిడిలకై ఇస్లామిక్ దేశాల నుంచి రూ.500 కోట్లు!

మతమార్పిడిలకై ఇస్లామిక్ దేశాల నుంచి రూ.500 కోట్లు!

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన జలాలుద్దీన్ అలియాస్‌ ఛంగూర్ బాబా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. చట్టవిరుద్ధంగా మత మార్పిడిలకు పాల్పడుతూ అరెస్టయిన ముఠాలో కీలక సూత్రధారిగా ఉన్న ఛంగూర్ బాబాకు ఇస్లామిక్ దేశాల నుంచి రూ.300 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నేపాల్‌లో 100 బ్యాంకు అకౌంట్లను వినియోగించినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. 

మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది. ఛంగూర్ బాబాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఐటీ శాఖల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ కేంద్రంగా చట్టవిరుద్ధంగా మత మార్పిడిలకు పాల్పడుతున్న జలాలుద్దీన్‌ అలియాస్‌ ఛంగూర్ బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నిందితుడు జమాలుద్దీన్ కార్యకలాపాలు “సమాజానికి మాత్రమే కాదు, దేశానికి కూడా వ్యతిరేకం” అని “ప్రాథమిక దర్యాప్తు”లో తేలిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలలో ఎటువంటి దయ చూపబోమని స్పష్టం చేస్తూ, “నిందితుల ఆస్తులు మరియు అతని ముఠాతో సంబంధం ఉన్న ఇతర నేరస్థుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటాము మరియు వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము” అని వెల్లడించారు.

భారీ ఎత్తున హిందూ యువతులను మతమార్పిడి చేసేందుకు ఛంగూర్ బాబాకు పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే, దుబాయ్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి రూ.300 కోట్లు వచ్చినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం నేపాల్‌లో 100 బ్యాంకు అకౌంట్లను వినియోగించినట్టు సమాచారం.  క్రాస్‌-బోర్డర్‌ నెట్‌వర్క్ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

అమర్ ఉజాలా నివేదిక ప్రకారం, ఛంగూర్ బాబా గత మూడు సంవత్సరాలలో సుమారు రూ.500 కోట్ల విదేశీ నిధులను అందుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. భద్రతా సంస్థలు ఇప్పటివరకు రూ.200 కోట్లను గుర్తించగా, మిగిలిన రూ.300 కోట్లు నేపాల్ ద్వారా మళ్లించినట్టు భావిస్తున్నారు. నేపాల్‌లోని ఏజెంట్లు అక్కడ డబ్బు విత్‌డ్రా చేసి భారత్‌లోని ఛంగూర్ బాబా నెట్‌వర్క్‌కు అందజేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏజెంట్లకు 4 నుంచి 5 శాతం కమిషన్ ఇచ్చినట్టు సమాచారం. 

భారత్‌లో ఛంగూర్ బాబా ముఠా 40 బ్యాంకు అకౌంట్లను లావాదేవీల కోసం వినియోగించినట్టు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపుర్‌లో మతమార్పిడి రాకెట్‌ను ఛేదించిన పోలీసులు ఛంగూర్‌ బాబాతో పాటు అతడి ముఠా సభ్యులను లఖ్‌నవూలో ఇంతకుముందు అదుపులోకి తీసుకున్నారు.  పేదలు, నిస్సహాయ కూలీలు, వెనుకబడిన వర్గాలు, వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్టు గుర్తించారు.

నిబంధనలకు విరుద్ధంగా వారికి నగదు, ప్రోత్సాహకాలతోపాటు కొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడుతూ మత మార్పిడులు చేస్తున్నట్లు గుర్తించారు. 15 ఏళ్లుగా ఛంగూర్ బాబా మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.  ఒకప్పుడు అతను సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయత్తులు అమ్ముకునేవాడని స్థానికులు తెలిపారు. యాంటి టెర్రరిజం స్క్వాడ్‌-ఏటీఎస్ ఛంగూర్ బాబాను ముమ్మరంగా విచారణ చేస్తోంది.

తాజాగా బలరాంపుర్‌లోని మధ్‌పుర్‌ గ్రామంలోని ఛంగూర్‌ బాబాకు చెందిన ఓ భవనం నుంచి కీలక పత్రాలను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. అంతకు ముందు ఛంగూర్‌ బాబాకు చెందిన ఒక అక్రమ నిర్మాణాన్ని యూపీ ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేసింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ రంగంలోకి దిగింది. ఛంగూర్ బాబాకు, అతడి ముఠాకు సంబంధించిన ఆస్తుల గురించి ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఐటీ శాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది.