ద‌లైలామా ఎంపిక‌లో డ్రాగ‌న్ దేశం పాత్రలేదు

ద‌లైలామా ఎంపిక‌లో డ్రాగ‌న్ దేశం పాత్రలేదు
 
త‌న త‌ద‌నంత‌రం కాబోయే ద‌లైలామా ఎంపిక‌లో డ్రాగ‌న్ దేశం చైనా పాత్ర ఏమాత్రం ఉండ‌బోద‌ని, భ‌విష్య‌త్తు ప‌ట్టాభిషేకాన్ని ద‌లైలామాకు చెందిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్ర‌స్టు చూసుకుంటుంద‌ని స్పష్టం చేయడం ద్వారా  బౌద్ధుల మత గురువు దలైలామా చైనాకు గట్టి షాక్ ఇచ్చారు. తమ చెప్పుచేతల్లో ఉండే కీలుబొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని భావిస్తున్న చైనాకు ఈ విధంగా గట్టి చెంపదెబ్బ కొట్టారు. 
 
గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌కు మాత్రమే తన వారసుడిని నిర్ణయించే అధికారం ఉంటుందని, అది కూడా తన మరణానంతరం మాత్రమే జరుగుతుందని దలైలామా స్పష్టం చేశారు. దలైలామా పునర్‌జన్మను చైనా రాజకీయం చేయాలని యత్నిస్తోందని విమర్శించారు. త‌న‌తో ద‌లైలామా వ్య‌వ‌స్థ ఆగిపోద‌ని స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న 14వ ద‌లైలామా అస‌లు పేరు టెంజిన్ గ్యాస్టో. టిబెట్ ఆయ‌న స్వంత దేశం. 

ద‌లైలామా వ్య‌వ‌స్థ అంశంలో జోక్యం చేసుకునే అధికారం ఎవ‌రికీ లేద‌ని  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మెక్‌లియోడ్‌గంజ్‌లో జ‌రిగిన బౌద్ద మతస్థుల మూడు రోజుల కాన్ప‌రెన్స్‌లో తేల్చి చెప్పారు. ఈ స‌మావేశానికి ఎంతో మంది బౌద్ద మ‌త ప్ర‌ముఖులు, విద్యావేత్త‌లు హాజ‌ర‌య్య‌ర‌య్యారు. ప్ర‌పంచంలోని వివిధ దేశాల‌కు చెందిన బౌద్ద సంఘాలు చేసిన విజ్ఞాప‌న మేర‌కు ద‌లైలామా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 

గ‌త 14 ఏళ్ల నుంచి దీనిపై ఎటువంటి బ‌హిరంగ చ‌ర్చ‌ జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంటూ 2011, సెప్టెంబ‌ర్ నుంచి ద‌లైలామాకు ఇదే ర‌క‌మైన‌ మెసేజ్‌లు వ‌స్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుత ద‌లైలామాకు 90 ఏళ్లు నిండిన నేప‌థ్యంలో అధికార మార్పు అంశంపై బౌద్ధ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది. గ్రెగోరియ‌న్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం జూలై ఆరో తేదీన ద‌లైలామాకు 90 ఏళ్లు పూర్తి కానున్నాయి. 

టిబెట్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం మాత్రం ఆయ‌న‌కు జూన్ 30వ తేదీనే 90 ఏళ్లు నిండాయి. త‌న‌కు 90 ఏళ్లు నిండిన త‌ర్వాత టిబెట్‌లోని బౌద్ద సంప్ర‌దాయానికి చెందిన లామాల‌ను సంప్ర‌దిస్తాన‌ని, టిబెట్ బుద్దిజంతో లింకున్న ప్ర‌తి ఒక్క‌రితో ద‌లైలామా వ్య‌వ‌స్థ గురించి చ‌ర్చించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

భ‌విష్య‌త్తు ద‌లైలామాకు చెందిన నియామ‌క ప్ర‌క్రియ గురించి 2011, సెప్టెంబ‌ర్ 24వ తేదీన జారీ చేసిన ప్రకటనలో ఆ విధానం స్పష్టంగా ఉన్నట్టు గుర్తు చేశారు. కొత్త ద‌లైలామా నియ‌మాక అధికారాలు గాడెన్ ఫోడ్రాంగ్ ట్ర‌స్టులో ఉన్న స‌భ్యుల వ‌ద్ద ఆ బాధ్య‌త ఉన్న‌ట్లు తెలిపారు. ద‌లైలామా వార‌స‌త్వంలో ఉన్న ధ‌ర్మ ర‌క్ష‌కుల‌ను క‌లుసుకుని దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు. 

ప్రాచీన సంప్ర‌దాయానికి త‌గిన‌ట్లు శోధించి  భ‌విష్య‌త్తు ద‌లైలామా ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఆయన సూచించారు.  ద‌లైలామా సంప్ర‌దాయ కొన‌సాగింపు అంశంలో చైనా నుంచి ఎవ‌ర్నీ ఎంపిక చేయ‌రాదు అన్న నిబంధ‌న కూడా ఉన్న‌ది. 2011, సెప్టెంబ‌ర్ 24 నాటి ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ప్ర‌క్రియ నుంచి చైనాను దూరం పెట్టాల‌ని అమెరికా, భార‌త్ భావిస్తున్నాయి. కానీ 1949 నుంచి చైనా ఆక్ర‌మ‌ణ‌లో టిబెట్ ఉన్న విష‌యం తెలిసిందే.