
ఎయిరిండియా విమాన ప్రమాదంలో కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల అహ్మదాబాద్ లో ఎఐ-171 విమానం కూలిపోయి 279 మంది మరణించిన ఘటనలో కుట్ర కోణంపై కూడా తాము దృష్టి సారించామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ చెప్పారు. ఈ విమాన ప్రమాదం కేసును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) ఈ కేసు దర్యాప్తు చేస్తోందని మంత్రి తెలిపారు.
పుణేలో జరుగుతున్న ఓ కాన్క్లేవ్లో మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ ప్రమాదం స్థలం నుంచి రికవరీ చేసిన బ్లాక్‌బాక్స్ ఎఎఐబి ఆదీనంలో ఉందని, విశ్లేషణ కోసం దానిని విదేశాలకు పంపబోమని స్పష్టంచేశారు. మంత్రి మాట్లాడుతూ “విమాన ప్రమాదంపై ఎఎఐబి పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. కుట్ర ఏదైనా ఉందా? అనే అంశంపై కూడా దృష్టిపెట్టారు. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలం కావడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది అరుదైన కేసు” అని తెలిపారు.
“దర్యాప్తు నివేదిక వస్తే గానీ రెండు ఇంజిన్లు విఫలం అయ్యాయా? లేక ఇంధన సరఫరాలో సమస్య తలెత్తిందా? అనేది తేలుతుంది. బ్లాక్ బాక్స్‌లోని కాక్‌పీట్ వాయిస్ రికార్డర్లో పైలట్ల సంభాషణ నిక్షిప్తమై ఉంది. నివేదిక మూడు నెలల్లో వస్తుంది. ఇప్పుడే దానిపై మాట్లాడటం తొందరపాటు అవుతుంది” అని మురళీధర్ చెప్పారు.
విశ్లేషణ కోసం బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నారనే ప్రచారాన్ని మంత్రి మురళీధర్ కొట్టిపారేశారు. అది ఎక్కడికీ పోదని, దర్యాప్తు సంస్థల కస్టడీలోనే ఉందని చెప్పారు. దేశంలో వినియోగిస్తున్న 33 డ్రీమ్‌లైనర్ విమానాలను డీజీసీఏ ఆదేశాల మేరకు క్షుణ్ణంగా తనిఖీలు చేశారని తెలిపారు. ప్రజలు ఇప్పుడు భయపడటం లేదని, వారు సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
More Stories
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి