విజయనగరం ఉగ్ర లింక్ కేసు ఎన్ఐఎకు అప్పగింత

విజయనగరం ఉగ్ర లింక్ కేసు ఎన్ఐఎకు అప్పగింత
 
విజయనగరం ఉగ్ర లింకు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ‌కు (ఎన్ఐఎ) బదిలీ చేస్తూ కేంద్రం హోమ్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారనే ఆరోపణలతో గత నెల 16న విజయనగరానికి చెందిన  సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29), హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ (28) లను విజయనగరం టూ టౌట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇరువురు నిందితులు విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 
 
ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమై, దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు వీరిద్దరూ కుట్ర పన్నారని తేల్చారు. వీరిద్దరిని వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకోగా ఎన్‌ఐఏ, యాంటీ బాంబ్ స్క్వాడ్, మిగిలిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుని వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. ఎక్కడెక్కడ బాంబులు పెట్టి పేల్చాలని చూశారు? సంఘ విద్రోహులుగా ఏ విధంగా మారాలని అనుకున్నారు? విదేశాల నుంచి ఏ రకంగా నిధులు అందాయి? దానిపై సమగ్రమైన సమాచారాన్ని ప్రాథమికంగా తెలుసుకున్నారు.
సిరాజ్, సమీర్‌లు హైదరాబాద్, విజయనగరం, అలాగే దేశంలోని ఇతర నగరాలు అయిన చెన్నై, ముంబై, ఢిల్లీలలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. వీరికి ఆదేశాలు ఇస్తున్న హ్యాండ్లర్ ఇమ్రాన్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నాడని భావిస్తున్నారు. ఇమ్రాన్ పంపిన డబ్బుతోనే సిరాజ్ పేలుడు పదార్థాలను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేశాడని, విజయనగరంలోని రంపచోడవరం అడవిలో డమ్మీ బ్లాస్ట్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
 
అలానే సిరాజ్ ఇంట్లో నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం వంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు వీరిద్దరినిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలలో ఎన్ఐఎ అధికారులు పెద్ద ఎత్తున దాడులు జరిపారు. ఇందులో 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక ఉన్న అంతర్జాతీయ ఉగ్ర సంబంధాలను నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
 
ఈ నేపథ్యంలో వీరిద్దరి నుంచి సేకరించిన ఆధారాలను క్రోడీకరించి ఇంకా లోతైన దర్యాప్తు అవసరమని భావించిన నేపథ్యంలో ఎన్ఐఏకు అప్పగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఇద్దరినీ ఎన్‌ఐఏకు అప్పగించేందుకు విజయనగరం పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఏ క్షణమైనా సిరాజ్, సమీర్లను జాతీయ దర్యాప్తు సంస్థ తమ ఆధీనంలోకి తీసుకుని ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.